తాడేపల్లి గ్యాంగ్‌రేప్ బాధితురాలికి మంత్రి సుచరిత భరోసా: రూ.5 లక్షల పరిహారం అందజేత
గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని సీతానగరం పుష్కర ఘాట్ వద్ద సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని హోం మంత్రి సుచరిత పరామర్శించారు. బాధితురాలు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతోన్నారు. కొద్దిసేపటి కిందటే ఆసుపత్రికి వెళ్లిన సుచరిత.. బాధితురాలి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పరిహారంగా అయిదు లక్షల రూపాయల చెక్కును బాధితురాలి తల్లికి అందజేశారు. బాధితురాలిని పరామర్శించడానికి సుచరిత గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి రావడం వరుసగా ఇది రెండోసారి.
సోమవారమే ఆమె తన సహచర మహిళా, శిశు సంక్షేమ మంత్రి తానేటి వనితతో కలిసి బాధితురాలిని పరామర్శించిన విషయం తెలిసిందే. తక్షణ సహాయం కింద తానేటి వనతి బాధితురాలి కుటుంబానికి 50 వేల రూపాయలను అందజేశారు. తాజాగా హోం మంత్రి అయిదు లక్షల రూపాయల పరిహారాన్ని చెక్కు రూపంలో ఇచ్చారు. ఈ ఘటనను అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. నిందితులపై కఠిన చర్యలు చర్యలు తీసుకుంటామని బాధితురాలి తల్లికి భరోసా ఇచ్చారు.

నిందితులను గాలించడానికి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిలో కొందరు అనుమానితులను పోలీసులు విచారిస్తోన్నారని, కేసు దర్యాప్తు సాగుతోందని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. నిర్మానుష్య ప్రదేశాలపై ప్రత్యేకంగా నిఘా ఉంచేలా వ్యవస్థను తీసుకుని రావాలని యోచిస్తున్నట్లు చెప్పారు.
సుచరితతో పాటు గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా, కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ఉన్నారు. బాధితురాలికి అందుతోన్న చికిత్స గురించి మంత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటోన్నారని డాక్టర్లు వివరించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని తాడేపల్లి సీతానగరానికి చెందిన కృష్ణ, వెంకటేష్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. కృష్ణానది తీరంలో ఒంటరిగా ఉన్న వారిపై ఇదివరకు కూడా దాడులు చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications