గుంటూరు జిన్నా టవర్ వివాదానికి చెక్: త్వరలోనే ఆ పని చేయబోతున్నాం: మేయర్
గుంటూరు: రాష్ట్రంలో కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూ వస్తోన్న గుంటూరు జిన్నా టవర్ వివాదానికి ప్రభుత్వం పుల్‌స్టాప్ పెట్టబోతోంది. సమస్యాతక అంశాన్ని అంతే సున్నితంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోనుంది. జిన్నా టవర్ పేరును మార్చడం లేదా దాన్ని కూల్చేయాలంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు, కార్యకర్తలు చేస్తోన్న డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ రెండూ కాకుండా మధ్యేమార్గాన్ని ఎంచుకుంది.

జిన్నా టవర్ వివాదం..
గుంటూరు నడిబొడ్డున ఉన్న టవర్‌కు పాకిస్తాన్ ఆవిర్భవించడానికి ప్రధాన కారకుడైన మహ్మద్ అలీ జిన్నా పేరు ఉండటం పట్ల బీజేపీ కొంతకాలంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ టవర్ పేరును మార్చాలని వారు డిమాండ్ చేస్తోన్నారు. లేదా దాన్ని కూల్చేయాలని పట్టుబడుతున్నారు. దేశ గణతంత్ర దినోత్సవం నాడు జిన్నా టవర్‌పై జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి హిందూ వాహిణి ప్రతినిధులు ప్రయత్నించారు. పోలీసులు వారి ప్రయత్నాలు అడ్డుకున్నారు.

వివాదానికి పుల్‌స్టాప్..
జిన్నా టవర్ కూల్చివేత లేదా పేరు మార్పు కోసం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను సైతం రూపొందించుకున్నారు. వచ్చేనెల 5వ తేదీ నాటికి జిన్నా టవర్‌పై జాతీయ పతాకాన్ని ఎగురవేస్తామంటూ బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. టవర్ పేరు మార్చాలంటూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు వినతిపత్రాలను కూడా ఇచ్చారు. ఈ వివాదం ఉధృతం కానున్న నేపథ్యంలో- ప్రభుత్వం నివారణ చర్యలకు దిగింది. ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుంది.

జిన్నా టవర్‌కు జాతీయ రంగులు..
ఎవరికీ, ఎలాంటి అభ్యంతరాలు లేకుండా జిన్నా టవర్ వివాదానికి బ్రేక్ వేయనుంది. జిన్నా టవర్‌కు జాతీయ పతకంలోని రంగులను వేయాలని నిర్ణయించుకున్నామని గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు వెల్లడించారు. త్వరలోనే ఈ పనులను చేపడుతామని పేర్కొన్నారు. దీనితోపాటు- స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర వేడుకల వంటి ప్రత్యేక సందర్భాల్లో త్రివర్ణ పతకానికి ఎగురవేయడానికి వీలుగా జిన్నా టవర్ పక్కనే ఓ భారీ స్తంభాన్ని కూడా నిర్మిస్తామని ఆయన చెప్పారు.

పరిశీలించిన ఎమ్మెల్యే, మేయర్..
ఈ రెండు చర్యల వల్ల ఎవరికీ అభ్యంతరం ఉండబోదని ఆయన అన్నారు. జిన్నా టవర్‌పై జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి హిందు వాహిణి ప్రతినిధులు ప్రయత్నించిన నేపథ్యంలో దానికి రక్షణ కల్పించారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఈ పనులను స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో కులాలు, మతాల కుంపటి రగిలించడానికి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తోన్నారని విమర్శించారు.

త్రివర్ణాలతో..
మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. బీజేపీ నాయకుల కంటే ముందే అధికారికంగా తాము జిన్నా టవర్‌పై జాతీయ జెండాను ఎగుర వేస్తామని మనోహర్ నాయుడు పేర్కొన్నారు. స్థానిక ముస్లింలు దీనికి అంగీకరించారని చెప్పారు. త్వరలోనే జిన్నా టవర్‌ను త్రివర్ణాలతో అలంకరిస్తామని, మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడిస్తామని స్పష్టం చేశారు. దేశ స్వాతంత్ర్యోద్యమంలో పలువురు ముస్లింలు ప్రాణాలను అర్పించారని ముస్తఫా అన్నారు.
Recommended Video

జిన్నా టవర్ వద్ద జాతీయ పతాకం..
తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ నాయకులు జిన్నా టవర్‌ను అడ్డుగా పెట్టుకుని మత సామరస్యానికి భంగం కలిగించేలా కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. జిన్నా టవర్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ముస్లిం పెద్దలు తీర్మానించారని గుర్తు చేశారు. బీజేపీ నాయకులు రాష్ట్రాభివృద్ధికి తమ విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలే తప్ప శాంతియుత పరిస్థితులకు భంగం వాటిల్లేలా ప్రవర్తించడం సరికాదని అన్నారు.












Click it and Unblock the Notifications