• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వ‌చ్చేది హంగ్.. మేమే కింగ్‌: ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

|

అమ‌రావ‌తి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌రువాత కాస్త చ‌ల్ల‌గా మారిన రాజ‌కీయ వాతావ‌ర‌ణం.. మ‌ళ్లీ వేడెక్కింది. మ‌రో ప‌దిరోజుల్లో ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌బోతున్నందున‌.. అన్ని రాజ‌కీయ పార్టీలు ఎవ‌రి వ్యూహాల్లో వాళ్లు త‌ల‌మున‌క‌ల‌వుతున్నారు. స‌రిగ్గా నెల‌రోజుల పాటు హైద‌రాబాద్‌లోని త‌న ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకున్న జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తెర‌మీదికి వ‌చ్చేశారు. పార్టీ నంద్యాల లోక్‌స‌భ అభ్య‌ర్థి ఎస్పీవై రెడ్డి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి నంద్యాల వెళ్లిన ఆయ‌న‌.. స‌మీక్షా స‌మావేశాల‌తో తీరిక లేకుండా గ‌డుపుతున్నారు. ఆదివారం ఉద‌యం ఆయ‌న గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో స‌మావేశం అయ్యారు. లోక్‌స‌భ‌, అసెంబ్లీ స్థానాల‌కు పోటీ చేసిన అభ్య‌ర్థులు ఈ భేటీకి హాజ‌ర‌య్యారు. సీనియ‌ర్ నాయ‌కులు నాదెండ్ల మ‌నోహ‌ర్‌, మాదాసు గంగాధ‌రం, రామ్మోహ‌న్ రావు, హ‌రిప్ర‌సాద్‌ ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు.

పోలింగ్ సంద‌ర్భంగా అభ్య‌ర్థులు ఎదుర్కొన్న అనుభ‌వాలు, వారికి ఎదురైన సంఘ‌ట‌న‌ల‌పై ఆరా తీశారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ స‌ర‌ళి ఎలా ఉందంటూ అభ్య‌ర్థుల‌ను అడిగి తెలుసుకున్నారు. నెల‌రోజుల పాటు తాను ఎందుకూ పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉండాల్సి వ‌చ్చింద‌నే విష‌యంపై వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. నిజానికి- పోలింగ్ ముగిసిన త‌రువాత జ‌న‌సేన పార్టీ కీల‌క నాయ‌కులు మాదాసు గంగాధ‌రం, హ‌రిప్ర‌సాద్‌, రామ్మోహ‌న్ రావు త‌దిత‌రులు జిల్లాలు, లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాలవారీగా స‌మీక్షా స‌మావేశాల‌ను నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా వెల్ల‌డైన అభిప్రాయాల‌ను క్రోడీక‌రించి.. పవ‌న్ క‌ల్యాణ్‌కు ఓ నివేదిక‌ను అంద‌జేశారు. ఆ నివేదిక‌పైనా చ‌ర్చించారు.

 వంతెన.. సీతాకోక చిలుక ఆకృతిలో! శ్రీవారి భక్తులకు ఇక‌ నాన్‌స్టాప్ ప్ర‌యాణం! వంతెన.. సీతాకోక చిలుక ఆకృతిలో! శ్రీవారి భక్తులకు ఇక‌ నాన్‌స్టాప్ ప్ర‌యాణం!

ఓట్ల లెక్కింపు రోజున ఏం చేయాలి?

ఓట్ల లెక్కింపు రోజున ఏం చేయాలి?

ఈ నెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు సంద‌ర్భంగా కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ఈ స‌మీక్షా స‌మావేశంలో ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ వారికి కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను సూచించారు. ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప‌నితీరు, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు, దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, దీనికి అనుగుణంగా కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ రూపొందించిన నియ‌మ‌, నిబంధ‌న‌ల గురించి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఇత‌ర నాయ‌కులు పార్టీ అభ్య‌ర్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వ‌ద్ద అప్ర‌మ‌త్తంగా ఉండాలని, చివ‌రి రౌండ్ ముగిసేంత వ‌ర‌కూ ఏ ఒక్క‌రు కూడా బ‌య‌టికి రాకూడ‌ద‌ని సూచించారు. ఓడిపోయే ప‌రిస్థితులు ఎదురైన‌ప్ప‌టికీ- చివ‌రి ఈవీఎం లెక్కింపు పూర్తయేంత వ‌ర‌కూ కౌంటింగ్ కేంద్రాన్ని వదిలి రాకూడ‌ద‌ని అన్నారు. తెలుగుదేశం పార్టీ గానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానీ అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డే అవ‌కాశం లేక‌పోలేద‌ని, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని చెప్పారు. ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై త్వ‌ర‌లోనే పోలింగ్ ఏజెంట్ల కోసం ప్ర‌త్యేకంగా మ‌రో స‌మావేశాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ సంద‌ర్భంగా వారికి భరోసా ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

కుట్ర‌ల వ‌ల్లే ప్ర‌జారాజ్యం తెర‌మ‌రుగు

కుట్ర‌ల వ‌ల్లే ప్ర‌జారాజ్యం తెర‌మ‌రుగు

ప‌వ‌న్ క‌ల్యాణ్ సోద‌రుడు, మెగాస్టార్ చిరంజీవి ఇదివ‌ర‌కు నెల‌కొల్పిన ప్ర‌జారాజ్యం పార్టీ ప్ర‌స్తావ‌న ఈ సంద‌ర్భంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ అంశంపై తాము చ‌ర్చించిన‌ట్లు పార్టీ అధికార ప్ర‌తినిధి మాదాసు గంగాధ‌రం సూచ‌న‌ప్రాయంగా వెల్ల‌డించారు. పార్టీ స‌మీక్షా స‌మావేశం సంద‌ర్భంగా ప‌లువురు అభ్య‌ర్థులు ప్ర‌జారాజ్యం పార్టీ ప్ర‌స్థానాన్ని ప్ర‌స్తావించార‌ని, ఈ అంశంపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగింద‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలో మ‌రో రాజ‌కీయ పార్టీ నిల‌దొక్కుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని కొంద‌రు రాజ‌కీయ పెద్ద‌లు ఉద్దేశ‌పూరంగా ప్ర‌జారాజ్యం పార్టీని అంతమొందించార‌ని ప‌లువురు అభ్య‌ర్థులు ఆవేశాన్ని, ఆక్రోశాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ కుట్ర‌లో కొన్ని ప్ర‌ధాన మీడియా సంస్థ‌లు కూడా భాగ‌స్వామ్యం అయ్యాయ‌ని అభిప్రాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. అదే త‌ర‌హా కుట్ర‌లు జ‌న‌సేన పార్టీపైనా చోటు చేసుకున్నాయ‌ని, దీన్ని తాము స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నామ‌ని, ఈ విష‌యంలో తాము సామాజిక మాధ్య‌మాల‌ను విస్తృతంగా వినియోగించుకున్నామ‌ని కొంద‌రు అభ్యర్థులు స్ప‌ష్టం చేయ‌గా.. వారిని ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌న‌స్ఫూర్తిగా అభినందించార‌ని చెబుతున్నారు.

స‌ర్వేల‌ను ప‌ట్టించుకోవ‌ద్దు

స‌ర్వేల‌ను ప‌ట్టించుకోవ‌ద్దు

లోక్‌స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు దేశ‌వ్యాప్తంగా వెలువ‌డిన స‌ర్వేల‌పైనా చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20 నుంచి 22 వ‌ర‌కు లోక్‌స‌భ స్థానాల‌ను గెలుచుకోవ‌చ్చంటూ వ‌చ్చిన స‌ర్వేల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ వారికి సూచించిన‌ట్లు తెలుస్తోంది. తాము అన్ని స్థానాల్లోనూ గ‌ట్టిపోటీ ఇచ్చామ‌ని, ఫ‌లితాల గురించి ఆశించ వ‌ద్ద‌ని అన్నారు. ఫ‌లితాల గురించి ముందే చ‌ర్చించుకోవ‌డం మితిమీరిన ఆత్మ‌విశ్వాసానికి నిద‌ర్శ‌న‌మ‌ని, అలాంటి ప‌రిస్థితిని తెచ్చుకోవ‌ద్ద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాతి ప‌రిస్థితులనూ చ‌ర్చించారు.

హంగ్ వ‌స్తుందా?

హంగ్ వ‌స్తుందా?

త‌న అంచ‌నా ప్ర‌కారం హంగ్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, అదే జ‌రిగితే- క‌ర్ణాట‌క త‌ర‌హాలో తాము కింగ్ మేక‌ర్‌గా మారుతామ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన మేజిక్ ఫిగ‌ర్ ఏ పార్టీకీ ద‌క్క‌ద‌ని, త‌మ మ‌ద్ద‌తు లేనిదే ఏ పార్టీ కూడా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌లేద‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భ‌వించిన పార్టీలు అభ్య‌ర్థుల‌ను కొనుగోలు చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తాయ‌ని, వాటి వ‌ల‌లో ప‌డొద్ద‌ని అన్నారు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ సీపీల ప‌రిస్థితి అంతంత మాత్ర‌మేన‌ని చెప్పారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక గాలి వీచింద‌ని, దాని వ‌ల్ల త‌మ పార్టీ లాభ‌ప‌డిందంటూ ప‌లువురు అభ్య‌ర్థులు ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు చెబుతున్నారు.

ఉత్త‌రాంధ్ర‌లో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌..

ఉత్త‌రాంధ్ర‌లో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌..

ఓట్ల లెక్కింపు కంటే ముందే- ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పార్టీ శ్రేణులు వెల్ల‌డించాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేసిన గాజువాక అసెంబ్లీ సెగ్మెంట్ స‌హా శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నంల‌ల్లో ప‌ర్య‌టిస్తార‌ని, దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను త్వ‌ర‌లోనే ఖ‌రారు చేస్తామ‌ని పార్టీ నాయ‌కులు స్ప‌ష్టం చేశారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్‌పై ప్ర‌స్తుతం చ‌ర్చ కొన‌సాగుతోంద‌ని చెప్పారు.

English summary
Jana Sena Party President Pawan Kalyan is review after Poll situation in the State. Pawan Kalyan is participated in review meeting organized at Party Office at Mangalagiri in Guntur District. Assembly and Lok Sabha party candidates is attend that meeting. In this Meeting, Pawan Kalyan told that, No party will get Magic Figure. We, Jana Sena Party will play key role in the State Politics Pawan Kalyan said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X