కాళ్లు విరగ్గొట్టి, తలకాయలు పగలకొట్టి-చంద్రబాబుపై నిప్పులు చెరిగిన గుంటూరు మహిళలు..!!
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా పర్యటనలో గందరగోళం చోటు చేసుకుంది. గుంటూరు వికాస్ నగర్ లో ఆయన నిర్వహించిన సభలో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

మొన్న కందుకూరు..
మొన్నటికి మొన్న నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలో తొక్కిసలాట చోటు చేసుకుని ఎనిమిదిమంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా గుంటూరు వికాస్ నగర్ లో నిర్వహించిన సభ, చంద్రన్న కానుకల పంపిణీ సభలోనూ అలాంటి పరిస్థితే ఏర్పడింది. ఈ సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ముగ్గురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

చంద్రన్న కానుకల పేరుతో
సంక్రాంతి పండగ సమీపిస్తోన్న నేపథ్యంలో చంద్రన్న కానుకల పేరుతో చీరలను పంపిణీ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. చంద్రన్న కానుకల పంపిణీ చేస్తోన్న సమయంలో- దీనికోసం వచ్చిన వారంతా ఒక్కసారిగా ముందుకు తోసుకుని వచ్చారు. దీనితో తొక్కిసలాట సంభవించింది. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.

అనధికారికంగా చంద్రన్న కానుక..
ఇదివరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు..సంక్రాంతి పండగ సమయంలో చంద్రన్న కానుక పేరుతో ఓ పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. దాన్నే ఇప్పుడు అనధికారికంగా ఏర్పాటు చేశారు. చంద్రన్న సంక్రాంతి కానుకగా దుస్తులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. కందుకూరు రోడ్ షోలో ఎనిమిది మంది మరణించిన ఉదంతం ఇంకా స్మృతిపథం నుంచి తొలగిపోకముందే మళ్లీ అలాంటి ఘటన పునరావృతం కావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది.

మహిళల మండిపాటు..
ఈ ఘటన పట్ల బాధిత మహిళలు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రన్న కానుకల కోసం తాను 30 మంది వృద్ధులను తీసుకొచ్చానని, ఈ రకంగా చేశారని స్థానిక టీడీపీ నాయకురాలొకరు ఆవేదన వ్యక్తం చేశారు. కాళ్లు విరగ్గొట్టి, తలకాయలు పగలకొట్టి ఇలానా కానుకలు ఇచ్చేదంటూ నిలదీశారు. చంద్రన్న కానుకలు ఇమ్మని తామేమైన అడిగామా అంటూ సూటిగా ప్రశ్నించారు.

ఎలా జరపాలో తెలీదా?
ఇంత మంది వస్తారని తెలిసి కూడా చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడం చేతకావట్లేదా? అంటూ వారు ధ్వజమెత్తారు. తొక్కిసలాట తరువాత చీరల పంపిణీని అప్పటికప్పుడే నిలిపివేశారు. ఈ ఘటన పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి సంతాపం తెలిపారు. వారిని ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications