మళ్ళీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు!!
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యవహారం పదేపదే వార్తల్లో నిలుస్తుంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇవ్వరని కూడా ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పటికే స్పందించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, జగన్ కాదంటే వ్యవసాయం చేసుకుంటానంటూ గతంలోనే వ్యాఖ్యలు చేశారు.
ఇక తాజాగా మరోమారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆర్కే చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ, వార్డు సచివాలయ వ్యవస్థ అన్ని పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని, ఈ కారణంగానే తాను అభివృద్ధి కార్యక్రమాలపైనే ఎక్కువగా దృష్టి సారించి పని చేస్తున్నానని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, సీఎం అండతో తాము చేస్తున్న అభివృద్ధి వెరసి నియోజకవర్గాన్ని పురోగతి వైపు తీసుకు వెళ్తున్నాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వెల్లడించారు. గత ఎన్నికలలో ప్రజలు వైసీపీని ఆదరించారని, మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించారని ఆయన గుర్తు చేశారు. ఈసారి కూడా మంగళగిరిలో ఎన్నికలలో వైసిపిదే గెలుపుని ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు.
వచ్చే ఎన్నికలలో ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది జగన్ నిర్ణయిస్తారని, ఆయన తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఇప్పటికే తాను చెప్పినట్టుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంగళగిరి నుండి టికెట్ ఇవ్వబోరని, అందుకే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసిపితో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది.
ఇక ఈ ప్రచారానికి ఆయన పదేపదే క్లారిటీ ఇస్తున్నప్పటికీ టికెట్ విషయంలో జగన్ నిర్ణయమే తుది నిర్ణయం అంటూ ఆయన పదేపదే చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే వచ్చే ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి టికెట్ చినిగినట్టేనా అన్న చర్చకు కారణంగా మారింది. ఎమ్మెల్యే ఆర్కే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితికి కారణమైంది.












Click it and Unblock the Notifications