మేకతోటి సుచరిత రాజీనామా - అసలు కారణం అదేనా..!!
మాజీ హోం మంత్రి..వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత కీలక నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సుచరిత ప్రకటించారు. తాను అధ్యక్ష పదవికి రాజీనామాకు ప్రత్యేకంగా కారణాలు ఏవీ లేవని, తన నియోజకవర్గం పైన ఎక్కువ సమయం కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో జగన్ సీఎం అయిన తరువాత ఆయన కేబినెట్ లో సుచరిత హోం మంత్రిగా వ్యవహరించారు. కేబినెట్ విస్తరణ వేళ సుచరితను కేబినెట్ నుంచి తప్పించారు.
ఆ సమయంలో సుచరిత మనస్థాపానికి గురయ్యారు. అనుచరులు ఆందోళనకు దిగారు. ఆ తరువాత సీఎం ను కలిసిన సుచరిత..తనను మంత్రి పదవి నుంచి తొలిగించినందుకు ఎటువంటి బాధ లేదని, పార్టీ కోసం పని చేస్తానని స్పష్టం చేసారు. ఆ సమయంలోనే గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను సుచరితకు అప్పగించారు. కానీ, జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో పార్టీ పరంగా సమస్యలు ఉన్నా.. సుచరిత వాటి పరిష్కరానికి చొరవ తీసుకోలేదనే అభిప్రాయం ఉంది. ఇదే సమయంలో ఎన్నికలకు సీఎం జగన్ సమాయత్తం అవుతున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇదే సమయంలో కొన్ని జిల్లాల్లో బాధ్యుల మార్పు పైన ఆలోచన చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా బాధ్యతల నుంచి సుచరిత తప్పుకున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లా బాధ్యతలను సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ కు ఇచ్చే అంశం పైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వెంటనే డొక్కా మాణిక్య వర ప్రసాద్ కు సీఎం జగన్ ఎమ్మెల్యే పదవి కట్టబెట్టారు. ఆ తరువాత తాడికొండ నియోజకవర్గ పరిశీలకుడిగా పార్టీ బాధ్యతలు కేటాయించింది. అప్పట్లోనే ఈ వ్యవహారం తాడికొండ వైసీపీలో కలకలం రేపింది.
స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి మద్దతు దారులు ఆందోళనకు దిగారు. ఆ తరువాత ప్రభుత్వ సలహాదారు సజ్జలతో ఎమ్మెల్యే శ్రీదేవి భేటీ తరువాత పరిస్థితి సద్దుమణిగింది. ఇప్పుడు సుచరిత జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవటంతో మరో సారి డొక్కా మాణిక్య వరప్రసాద్ కు బాధ్యతల కేటాయింపు పైన చర్చ మొదలైంది. అయితే, ఇప్పుడు సుచరిత నిర్ణయం పైన రాజకీయంగా కీలకమైన గుంటుూరు జిల్లా వైసీపీలో చర్చకు కారణమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ..పలు జిల్లాల్లో వైసీపీ లో కొత్త బాధ్యతలు.. మార్పులు - చేర్పులు ఆసక్తి కరంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications