అంబటి రాంబాబు అనే ఈ సత్తెనపల్లి శాసనసభ్యుడు, ఈ ఇరిగేషన్ మంత్రి- రాజీనామాకు సిద్ధం..!!
అమరావతి: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజూ వార్తల్లో నిలుస్తోన్న అంశం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్ర. త్వరలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోన్నారు. ఇందులో భాగంగా వారాహి పేరుతో ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు కూడా. హైదరాబాద్‌లో దీని రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ఈ బస్సుయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.

అంబటి టార్గెట్‌గా..
ఈ నేపథ్యంలో- పవన్ కల్యాణ్ తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేస్తానని తేల్చి చెప్పారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ భవిష్యత్ అంధకారమౌతుందని హెచ్చరించారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే, జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై ఘాటు విమర్శలు చేశారు. అదే రేంజ్‌లో ఆరోపణలనూ గుప్పించారు. కాపుల గుండెల్లో కుంపటిలా అంబటి రాంబాబు తయారయ్యారని, గాడిదలా ఓండ్రపెడుతున్నారంటూ ధ్వజమెత్తారు.

అంబటి కౌంటర్ అటాక్..
తనపై చేసిన ఈ విమర్శలకు అంబటి రాంబాబు స్పందించారు. పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. పోలవరం పూర్తి చేయకపోతే తాను మంత్రే కాదంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వ హయాంలో 2018 నాటికే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడని, అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించావా? అంటూ అంటూ నిలదీశారు. కాపులను గంపగుత్తగా చంద్రబాబుకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తోన్నావని మండిపడ్డారు.

వారాహికి బదులుగా..
తన వాహనానికి వారాహికి బదులు వరాహం అని పెట్టుకోవాలని అంబటి రాంబాబు అన్నారు. గ్లాసుకు వేసే ఓట్లన్నీ మురిగిపోతాయని పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గానికి పవన్ కల్యాణ్ శనిలా దాపురించాడని, వారందరినీ తీసుకెళ్లి- చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టడానికి సిద్ధపడుతున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు వద్ద ప్యాకేజ్ తీసుకుని రాజకీయాలు చేస్తోన్నాడని, రాష్ట్ర రాజకీయాల్లో ప్యాకేజీ స్టార్ ఎవరో అందరికీ తెలుసని ఎదురుదాడికి దిగారు.

చంద్రబాబును భుజాన..
పార్టీ పెట్టిన వారెవరైనా తాను అధికారంలోకి రావాలని, ముఖ్యమంత్రి కావాలని అనుకుంటారని, పవన్ కల్యాణ్ మాత్రం చంద్రబాబు కోసం కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతోనే కలిసి వెళ్తాననే విషయాన్ని ఈ సభ ద్వారా ఆయన మరోసారి స్పష్టం చేశారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. కాపు నాయకుడు వంగవీటి రంగాను హత్య చేయించి, ముద్రగడ పద్మనాభాన్ని చిత్రహింసలకు గురి చేసిన చంద్రబాబును పవన్ కల్యాణ్ భుజాను మోస్తున్నాడని మండిపడ్డారు.

నిరూపించు..
తాను రెండు లక్షల రూపాయల లంచం తీసుకున్నానని పవన్ కల్యాణ్ సత్తెనపల్లి సభలో ఆరోపించారని, దాన్ని నిరూపించగలడా అంటూ ప్రశ్నించారు. తాను రెండు లక్షల రూపాయలను లంచంగా తీసుకున్నానని పవన్ కల్యాణ్ నిరూపించగలిగితే అంబటి రాంబాబు అనే నేను సత్తెనపల్లి శాసనసభ సభ్యత్వానికి, ఇరిగేషన్ మంత్రిత్వ శాఖకు రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తాను విసిరిన ఈ సవాల్ నుంచి పవన్ కల్యాణ్ పారిపోకూడదని హెచ్చరించారు. 2019లో జగన్ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రతిజ్ఞ చేశాడని, అది ఏమైందని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications