జగన్ కొత్త డ్రామా ఇది.. అమరావతిని చంపేసి..: విచారణకు సిద్ధమంటూ నారా లోకేష్ సవాల్
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్. రాజధాని పేరుతో గత ప్రభుత్వం అక్రమాలు, అవినీతికి పాల్పడిందంటూ ఆరోపణలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

జగన్ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి..
‘ఏడు నెలలుగా వైఎస్ జగన్ గారు తవ్వుతోంది అవినీతి కాదు వైకాపా ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి. ఆధారాలు బయటపెట్టమని అడుగుతుంటే జగన్ గారు అవే పాత కాకి లెక్కలు చెబుతున్నారు. 4,075 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారు 5 ఏళ్ల టీడీపీ పాలనలో రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు 1170 ఎకరాలు. మరి 4,075 ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ ఎలా జరిగిందో భ్రమల్లో బ్రతుకుతున్న వైకాపా నాయకులు, ఉపసంఘం మేధావులు చెప్పాలి' అని లోకేష్ విమర్శలు చేశారు.

జగన్‌కు లోకేష్ సవాల్..
‘ఉపసంఘం నివేదికపై ఓపెన్ ఛాలెంజ్. అమరావతిలో జగన్ గారు ఆరోపిస్తున్న ఇన్సైడర్ ట్రేడింగ్ పై జ్యూడిషియల్ ఎంక్వయిరీకి మేము సిద్ధం. అదే సమయంలో గత 7 నెలల కాలంలో విశాఖ, విజయనగరం జిల్లాల్లో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ పై జ్యూడిషియల్ ఎంక్వయిరీకి జగన్ గారు సిద్ధమా?' అని లోకేష్ సవాల్ విసిరారు.
జగన్ కొత్త డ్రామా అంటూ..
‘మొన్నటి వరకూ అమరావతిని భ్రమరావతి అన్న వైఎస్ జగన్ గారు నిజాలు ప్రపంచానికి తెలిసాక కొత్త పాట మొదలుపెట్టారు. చంద్రబాబుగారు ఖర్చు చేసింది రూ.5 వేల కోట్లే, రాజధాని అభివృద్ధి కోసం రూ.లక్ష కోట్లు కావాలి అంటూ కొత్త డ్రామా షురూ చేసారు.'
ఆ శ్వేతపత్రంలో..
‘28.06.19న ఏపీ సీఆర్డీఏపై వైకాపా ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంలో రూ. 9,165 కోట్లు చంద్రబాబుగారి ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి ఖర్చు చేసింది అని చెప్పారు. అమరావతి ఫైనాన్షియల్ ప్లాన్ గురించి ఫిభ్రవరి 2019లో టీడీపీ ప్రభుత్వం జీవో 50 విడుదల చేసింది' అని లోకేష్ చెప్పుకొచ్చారు.

అమరావతిని చంపేసి..
‘అందులో అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.55,343 కోట్లు. ఇందులో రాబోయే 8 ఏళ్లలో ఖర్చు పెట్టాల్సింది రూ.6629 కోట్లు. ప్రభుత్వానికి మిగిలే భూమితో మిగిలిన ఖర్చు అంతా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ద్వారానే వస్తుంది. అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలి చంద్రబాబుగారు స్పష్టంగా చెప్పారు. విశాఖలో తన ల్యాండ్ మాఫియా అభివృద్ధి కోసం ఉన్న అమరావతిని చంపేసి కొత్త రాజధాని అంటున్నారు' అని లోకేష్ విమర్శించారు.












Click it and Unblock the Notifications