రైలులో షార్ట్ సర్క్యూట్ : తప్పిన పెను ప్రమాదం : ముగ్గురి పరిస్థితి విషయం..!
ప్యాసింజర్ రైలులో షార్ట్ సర్క్యూట్ రావటంతో నలుగురు ప్రయాణీకులు గాయపడ్డారు. కదులుతున్న రైలుతో కిటీకి చువ్వలు పట్టుకున్న సమయంలో షాక్ కొట్టటంతో వారు ప్లాట్‌ఫాం మీదకు దూకేసారు. రైలులో సాంకేతిక లోపం కారణంగానే షార్ట్ సర్క్యూట్ అయిందని అధికారులు చెబుతున్నారు. దీనిపైన రైల్వే అధికారులు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.
ప్యాసింజర్ రైలులో షార్ట్ సర్క్యూట్..
ప్యాసింజర్ రైలులో షార్ట్ సర్క్యూట్ అవ్వటంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. గుంటూరు నుండి ఒంగోలు వెళుతున్న ప్యాసింజర్ రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా వేజెండ్ల రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. తెనాలి మీదుగా గుంటూరు నుండి ఒంగోలు వెళ్తున్న సమయంలో మధ్యలో వేజెండ్ల వద్ద రైలు ఆగింది. ఆ సమయంలో కొందరు ప్రయాణీకులు రైలు దిగటానికి బోగీలోని తలుపుకు ఇరువైపులా ఉండే ఉనుప చువ్వలను పట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా వారికి షాక్ కొట్టింది. వెనకాల ఉన్న వారికి కూడా కరెంట్ పాస్ అయింది. దీంతో..ఒక్కసారిగా బోగీతో పాటుగా స్టేషన్‌లో గందరగోళం ఏర్పడింది.

తప్పిన పెను ప్రమాదం..
రైలులో షాక్ కొట్టిందనే ఆందోళనతో ప్రయాణీకులు ప్లాట్ ఫాం మీదకు దూకేసారు. అయితే నిర్మాణంలో ఉన్న ప్లాట్ ఫాం కావటంతో పలువురు గాయపడగా అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైలులో సాంకేతిక లోపం కారణంగానే షా్ట్ సర్క్యూట్ అయినట్లు తెలుస్తోంది. సరిగ్గా ప్రయాణీకులు ఆందోళన చెందుతున్న సమయంలో విషయం తెలుసుకున్న ప్యాసింజర్ రైల్వే గార్డు అప్రమత్తమై రైలులోని విద్యుత్ సరఫరాను నిలిపేయడంతో పెనుప్రమాదం తప్పింది. దీనిపై రైల్వే శాఖ అధికారులు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.












Click it and Unblock the Notifications