రాజధాని అమరావతిలో ఉద్రిక్తత: బీజేపీ నేత కారుపై రాళ్ల దాడి
అమరావతి: అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ ఈ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు, నిరసన దీక్షలు ఇవ్వాళ 1,200 రోజులకు చేరాయి. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల కిందట అసెంబ్లీలో ప్రకటించిన తరువాత అమరావతి ప్రాంత రైతులు ఈ ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున దీక్షా శిబిరాలను ఏర్పాటు చేశారు.
వైఎస్ జగన్ చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ న్యాయస్థానాల్లోనూ పిటీషన్లు వేశారు. ప్రస్తుతం ఇవి సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్నాయి. న్యాయస్థానం టు దేవస్థానం యాత్రను చేపట్టారు. దీన్ని విజయవంతంగా ముగించారు. అమరావతి నుంచి అరసవిల్లి వరకు చేపట్టిన పాదయాత్ర మాత్రం సంపూర్ణం కాలేదు. అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇవ్వాళ- మళ్లీ అమరావతి ప్రాంత రైతులు నిరసన దీక్షలకు దిగారు. 1,200 రోజుకు చేరుకున్న నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో నెలకొల్పిన దీక్షా శిబిరాల్లో నిరసనలను చేపట్టారు.

ఈ ఆందోళనకు అధికార వైసీపీయేతర పార్టీలన్నీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఈ ఆందోళనలను ముందుండి నడిపిస్తోంది. బీజేపీ, జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్.. వారికి అండగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఇవ్వాళ టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు- మరోసారి రైతుల నిరసన దీక్షలను సందర్శించారు. మందడంలో రైతులతో మాట్లాడారు.
తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా వారితో జట్టు కట్టారు. మందడం దీక్షా శిబిరం నుంచి సత్యకుమార్ తుళ్లూరుకు బయలుదేరి వెళ్లారు. అక్కడ పార్టీ నాయకుడి ఇంటికి వెళ్లారు. ఆయనను పరామర్శించిన అనంతరం విజయవాడ వైపు వెళ్తోన్న సమయంలో ఉద్దండరాయునిపాలెం వద్ద ఆయన కారుపై రాళ్ల దాడి చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు సత్యకుమార్ ప్రయాణిస్తోన్న కారుపై రాళ్లు విసిరారు.
ఈ ఘటనలో సత్యకుమార్ కారు అద్దాలు పగిలాయి. మూడు రాజధానులకు మద్దతుగా వెలిసిన దీక్షా శిబిరాల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్న వారే ఈ దాడి చేసి ఉంటారని అనుమానిస్తోన్నారు. బీజేపీ నాయకులు మాత్రం- ఈ దాడి వెనుక వైసీపీ నాయకులు ఉన్నారంటూ ఆరోపిస్తోన్నారు. రాళ్ల దాడికి నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. దీనితో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications