హిందూపూర్ మున్సిపాలిటీపై బాలయ్య ఫోకస్ .. నేటినుండి ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల ప్రచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు మార్చి 10వ తేదీన జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి . ఇప్పటికే ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎన్నికలు జరిగే ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్ లపై ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్న అధికార వైసిపి , వైసీపీ జెండా ఎగరవేయడానికి ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో టిడిపి సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.

హిందూపూర్ మున్సిపాలిటీపై వైసీపీ ఫోకస్
ఇదిలా ఉంటే రాయలసీమలో గత ఎన్నికల్లో పూర్తిగా వైసిపి హవా కొనసాగేలా చేసిన జగన్మోహన్ రెడ్డికి , ఒక హిందూపురం నియోజకవర్గం మాత్రం కొరకరాని కొయ్యలా తయారైంది. 2014, 2019 ఎన్నికలలో రెండు దఫాలలో కూడా వైసిపి హిందూపురం నియోజకవర్గాన్ని చేజార్చుకోవటంతో అక్కడ ఎలాగైనా వైసీపీ జెండా ఎగురవేయాలని కంకణం కట్టుకుంది అధికారపార్టీ. అందులో భాగంగా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో మెజారిటీ స్థానాలను వైసిపి తన ఖాతాలో వేసుకుని బాలయ్యకు ఝలక్ ఇచ్చింది. ఇప్పుడు హిందూపూర్ మున్సిపాలిటీపై ఫోకస్ పెట్టింది .

రంగంలోకి దిగిన బాలయ్య .. నేటి నుండి ఎన్నికల ప్రచార హోరు
ఇక ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలలో అటువంటి పరిస్థితి రాకుండా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు నందమూరి బాలకృష్ణ. టిడిపి హయాంలోనే హిందూపూర్ అభివృద్ధి చెందిందని, ఓట్లు అడిగే హక్కు ఒక్క టీడీపీకే ఉందని పార్టీ శ్రేణులకు వివరించిన బాలకృష్ణ మున్సిపల్ ఎన్నికల్లో విజయం మనదే నంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
Recommended Video

ఆంజనేయస్వామికి పూజలు చేసి ప్రచారం మొదలుపెట్టిన బాలయ్య.. తొలిరోజు ప్రచారం చేసే ప్రాంతాలివే
ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా సుగురు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి బాలయ్య ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మోత్కుపల్లి ,విద్యానగర్, బోయ పేట, నింకంపల్లి మేలపురం, విజయనగర్ కాలనీ, ముదిరెడ్డిపల్లి, సింగిరెడ్డి పల్లి లో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. పంచాయతీ ఎన్నికలలో దెబ్బతిన్న నేపథ్యంలోనే, అప్రమత్తమైన బాలయ్య మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేకమైన దృష్టి సారించి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications