Year ender 2020 : ఈ ఏడాది తెలంగాణా రాష్ట్రంలో 6శాతం తగ్గిన నేరాలు ... వార్షిక నేరనివేదికను వెల్లడించిన డీజీపీ
2020 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో నేరాలు బాగా తగ్గాయని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. స్మార్ట్ పోలీసింగ్ ద్వారా ప్రజలకు అన్ని రకాల సేవలను అందుబాటులోకి తెచ్చామని, నేరం చేయాలంటేనే భయపడేలా అన్ని వ్యవస్థలను సిద్ధం చేశామని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు . నేరం చేస్తే దొరికి పోతాము అనే భయం నేరస్తులలో కలిగించామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి.
year ender 2020 : ఒళ్ళు గగుర్పొడిచే క్రైం సినిమాలా వరంగల్ 9 హత్యల ఘటన .. మానవ మృగానికి మరణ శిక్ష

సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువగా పోలీసింగ్
ఫంక్షనల్ వర్టికల్ సిస్టమ్ అమలు ద్వారా పోలీసుల పనితీరును మెరుగుపరిచాలని చెప్పిన ఆయన ప్రజలకు మరింత చేరువ కావడానికి సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నట్లు గా పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అనేక రకాల మోసాలపై అవగాహన కల్పిస్తున్నామని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే అన్ని రకాల నేరాలు తగ్గుముఖం పట్టాయి అన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి.

6 శాతం తగ్గిన అన్ని రకాల నేరాలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల నేరాలు 6 శాతం తగ్గాయని ఆయన వివరించారు. హత్యలు 8.5% తగ్గాయని మహిళలపై నేరాలు 1.9 శాతం తగ్గాయని, రహదారి ప్రమాదాలు 13.9 శాతం తగ్గగా, వైట్ కాలర్ నేరాలు 42% తగ్గాయన్నారు. అంతేకాదు ఇప్పటివరకు 48.5% ఈ ఏడాదిలో నేరస్తులకు శిక్ష పడింది అన్నారు. పలు ఎన్ కౌంటర్లలో 11 మంది మావోయిస్టులు మృతి చెందారని, ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులతో సహా 135 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు అని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.

నేరరహిత , మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణా
నేర రహిత, మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కోసం లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించకుండా అడ్డుకున్నామని, శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ శాఖ సఫలీకృతం అయిందని ఆయన వివరించారు. కరోనా లాక్డౌన్ సమయంలో తెలంగాణ పోలీసులు అందించిన సేవలను ప్రజలు ప్రశంసించారని, నిరుపమానమైన సేవలను పోలీస్ వ్యవస్థ అందించిందని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ .. నేరాల తగ్గుదల .. కానీ కరోనా పోరాటంలో పోలీసుల సేవలు భేష్
మొత్తానికి 2020లో 6 శాతం నేరాలు తగ్గాయన్న డీజీపీ మహేందర్ రెడ్డి ఇదంతా పోలీసుల కృషి అని చెప్తున్నా, కరోనా లాక్డౌన్ ప్రభావం వల్ల ఈసారి నేరాలు తగ్గినట్లుగా భావిస్తున్న వారు లేకపోలేదు.
కరోనా సమయంలో ప్రజలు అందరూ దాదాపు ఇళ్లకే పరిమితం కావటం తో నేరాలు గణనీయంగా తగ్గాయి. ప్రజలు ఎవరూ బయట తిరిగే పరిస్థితి లేక కూడా నేరాలు తగ్గాయి . కానీ ఈ ఏడాది నేరాల తగ్గుదలలో పోలీసుల పాత్ర ఎలా ఉన్నా , కరోనా సమయంలో మాత్రం పోలీసులు కీలక భూమిక పోషించి ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించబడ్డారు .