ఎడమ కాలికి సమస్యతో వస్తే.. రోగి కుడి కాలుకు ఆపరేషన్: వైద్యుడిపై వేటు
హైదరాబాద్: నగరానికి చెందిన ఓ వైద్యుడు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి సస్పెండ్ అయ్యారు. ఓ వ్యక్తి తన ఎడమ కాలు సమస్యతో వస్తే.. అతని కుడి కాలుకు ఆపరేషన్ నిర్వహించాడు వైద్యుడు. దీంతో బాధితుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో బాధ్యుడైన ప్రైవేట్ వైద్యుడిని తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది.
అంతేగాక, హైదరాబాద్ నగరానికి చెందిన సదరుడు వైద్యడు, ఆర్థోపెడిషియన్ డాక్టర్ కరణ్ ఎం పాటిల్.. లైసెన్స్‌ను ఆరు నెలలపాటు రద్దు చేసింది.ఎడమ కాలి సమస్యతో ఓ వ్యక్తి వస్తే.. అతని ఎడమ కాలుకు కాకుండా కుడి కాలుకు ఆపరేషన్ చేశాడు డాక్టర్ కరణ్. ఆ తర్వాత తన పొరపాటును గ్రహించి ఎడమ కాలుకు చికిత్స చేస్తాడు.

ఈ నేపథ్యంలో బాధితుడు డిస్ట్రిక్ట్ అండ్ హెల్త్ ఆఫీసర్(డీఎంహెచ్ఓ)కు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు అనంతరం డాక్టర్ కిరణ్ విధుల్లో నిర్లక్ష్యం వహించి బాధితుడికి తీవ్ర నష్టం కలిగించాడని మెడికల్ కౌన్సిల్ గుర్తించింది. ఈ క్రమంలోనే సదరు వైద్యుడిని సస్పెండ్ చేయడంతోపాటు ఆరు నెలలపాటు అతని వైద్య లైసెన్స్‌ను రద్దు చేసింది.
మరో ఘటనలో మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వైద్యుడిపై కూడా మెడికల్ కౌన్సిల్ వేటు వేసింది. డెంగ్యూ వ్యాధి వచ్చిన రోగిని మంచి ఆస్పత్రికి రెఫర్ చేయకుండా అతని మరణానికి కారణమయ్యాడు ఈ వైద్యుడు. డాక్టర్ సీహెచ్ శ్రీకాంత్ అనే వైద్యుడిపై మృతుడి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. పరిస్థితి విషమించే వరకు కూడా మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రిని అతడు రెఫర్ చేయలేదని ఆరోపించారు. ఈ క్రమంలో రోగి ప్రాణాలు కోల్పోయాడు.
కాగా, కలెక్టర్ నివేదిక ఆధారంగా మెడికల్ కౌన్సిల్ సదరు వైద్యుడిపై సస్పెన్షన్ వేటు వేసింది. మూడు నెలలపాటు అతని వైద్య లైసెన్స్ ను రద్దు చేసింది. తమ సర్టిఫికెట్లను కౌన్సిల్ కు సమర్పించాలని ఆదేశించింది. అయితే, సస్పెన్షన్ వేటుపై డాక్టర్లు 60 రోజుల్లో అప్పీల్ కు వెళ్లేందుకు అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications