విషాదం: పని ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ అంటే మంచి జీతం, వారానికి రెండ్రోజుల సెలవులు, విలాసవంతమైన జీవితం ఉంటుందని సాధారణంగా అనుకుంటారు. కానీ, పని ఒత్తిడి కూడా టెక్కీలపై అమితంగా ఉంటుంది. వారానికి ఐదు రోజులు పనిచేసినా.. అప్పుడప్పుడు 10 గంటలపాటు నిర్విరామంగా పనిచేయాల్సి రావచ్చు. ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానాన్ని అప్‌డేట్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది.
ఇప్పుడైతే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ఉద్యోగాలకు కూడా గ్యారంటీ లేకుండా పోయింది. అవసరం లేకుంటే.. వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి సాఫ్ట్‌వేర్ సంస్థలు. ఈ క్రమంలో కొందరు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. తాజాగా, ఇలా పని ఒత్తిడిని తట్టుకోలేక హైదరాబాద్ నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నగర శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

గుంటూరుకు చెందిన వినోద్ కుమార్(32) నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇప్పటి వరకు వర్క్‌ఫ్రం హోం ద్వారా గుంటూరు నుంచే పనిచేశాడు. ఆఫీసుకు రావాలని కోరడంతో.. అల్కాపూర్‌లోని తన సోదరుడి ఇంట్లో ఉంటూ ఉద్యోగానికి వెళుతున్నాడు. అయితే, ఉద్యోగ నిర్వహణలో భాగంగా కొత్త టూల్స్ వస్తుండటంతో వినోద్ వాటిపై పట్టు సాధించలేకపోయాడు. ఈ విషయంపై తన సోదరుడితో కూడా తరచూ చర్చించేవాడు.
తాను చేసే ఉద్యోగంలో పని ఒత్తిడి, ఉద్యోగ భద్రత కూడా లేదని వినోద్ భావించాడు. ఈ క్రమంలోనే గురువారం సోదరుడు, అతని భార్య బయటకు వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు వినోద్. ఇంటికి వచ్చిన సోదరుడు గమనించిన వెంటనే వినోద్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వినోద్‌కు భార్య, మూడేళ్ల కుమార్తె ఉంది. వినోద్ మృతితో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.












Click it and Unblock the Notifications