ఇంటికి లేటుగా వస్తున్నావని ప్రశ్నిస్తే.. కన్న తండ్రినే దారుణంగా చంపేసింది
హైదరాబాద్: కంటికి రెప్పలా కాపాడుతున్న కన్న తండ్రినే ఓ యువతి అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేటలోని తులసీరామ్ ప్రాంతంలో జగదీష్ కుటుంబం నివాసం ఉంటోంది. తండ్రి జగదీశ్ కూలీ పని చేస్తుండగా.. తల్లి చెత్తను ఏరుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి 23 ఏళ్ల నిఖిత అనే కుమార్తె ఉంది. కుటుంబ పేదరికం నేపథ్యంలో అప్ఝల్‌గంజ్‌లోని పండ్ల దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉండేది.

పని నుంచి ఇంటికి ఎప్పడూ ఆలస్యంగా ఇంటికి వస్తుండేది నిఖిత. దీంతో నిత్యం తండ్రి మందలిస్తుండేవాడు. ఈ క్రమంలో ప్రతిరోజూ ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. తండ్రి ఎన్ని మాటలు చెప్పినా.. మందలించినా నిఖిత వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. దీంతో ప్రతిరోజూ గొడవ జరుగుతుండేది. చుట్టుపక్కల వాళ్లు అప్పుడప్పుడు కలగజేసుకున్నా.. ఆ తర్వాత వాళ్లు కూడా పట్టించుకోవడం మానేశారు.
అయితే, శనివారం జగదీశ్ మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. అప్పటికీ నిఖిత ఇంటికి రాకపోవడంతో ఆగ్రహానికి గురయ్యాడు. అర్ధరాత్రి వచ్చిన నిఖితతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తండ్రీ, కూతురు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన నిఖిత.. ఆవేశంతో తల్లి ఏరుకునే చెత్త సంచిలో నుంచి ఓ గాజు పెంకుతో తండ్రి గొంతుకోసింది. దీంతో తండ్రికి తీవ్రగాయాలయ్యాయి.
రక్తపు మడుగులో పడివున్న జగదీశ్‌ను స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు జగదీశ్. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. జగదీశ్ కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు. హత్య ఘటనపై ప్రశ్నించగా.. తాను కావాలని చేయలేదని నిఖిత పోలీసులకు చెప్పింది. ఈ నేపథ్యంలో నిఖితపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications