పాదయాత్ర: తెలంగాణలో ఆప్ షురూ.. ఎప్పటి నుంచి అంటే..?
పంజాబ్‌లో ఆప్ విజయంతో.. మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రభ గురించి చర్చ జరుగుతుంది. ఈ డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. అక్కడ కూడా ఫోకస్ చేస్తామని కేజ్రీవాల్ అంటున్నారు. మరీ తెలుగు రాష్ట్రాల గురించి కూడా యోచిస్తున్నారట. అవును తెలంగాణలో పాదయాత్రలు చేపట్టనుందట. ఇప్పటికే సీనియర్ మహిళా నేత ఇందిరా శోభన్‌కు కో ఇంచార్జీ పదవీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

పాదయాత్ర.. ఎప్పటి నుంచి అంటే..
తెలంగాణ రాష్ట్రం వైపు ఆప్ చూస్తోంది. ఇక్కడ కూడా పాగా వేయాలని ప్లాన్స్ రచిస్తోంది. కార్యచరణను కూడా రూపొందించింది. దక్షిణాది రాష్ట్రాల ఇంఛార్జీగా ఉన్న ఆ పార్టీ ఢిల్లీ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి మీడియాతో మాట్లాడారు. తెలంగాణాలో ఏప్రిల్ 14వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ప్రజా సమస్యలు, సీఎం కేసీఆర్ వైఫల్యాలపై పోరాడాలని నిర్ణయించినామని, పంజాబ్‌లో గెలుపుతో తమలో నూతనోత్సాహం వచ్చిందన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలో పంజాబ్‌లో భారీ మెజార్టీతో గెలవడం జరిగిందని గుర్తు చేశారు.

పెరిగిన ఆదరణ
తమ పార్టీకి ఆదరణ పెరుగుతుందని.. దక్షిణ భారతదేశం నుంచి వేల సంఖ్యలో తమకు ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో ఆప్ పార్టీని విస్తరించాలని చూస్తున్నామని, పంజాబ్‌లో ఉన్న పరిస్థితులు తెలంగాణలో కూడా ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. 60 సంవత్సరాల పోరాటం, అనేక మంది ఆత్మబలిదానాలు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. సీఎం అయిన తర్వాత రాష్ట్రానికి కేసీఆర్ అన్యాయం చేశారని విమర్శించారు. 2014 ఎన్నికల హామీలలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని.. ఇలాంటి ఎన్నో మాటలు తప్పారన్నారు.

అన్యాయం..
రైతులకు కూడా కేసీఆర్ అన్యాయం చేశారని విమర్శించారు. చాలా మంది విద్యావంతులు నిరుద్యోగులుగా మిగిలిపోయారనే ప్రస్తావించారు. 80 వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి.. ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో ఇంతవరకు చెప్పలేదన్నారు. వర్సిటీలో 1330 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు, రాష్ట్ర బడ్జెట్‌ని దుర్వినియోగం చేయడంలో కేసీఆర్ పీహెచ్‌డీ చేశారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ ఎడ్యుకేషన్, హెల్త్ పాలసీలో నెంబర్ వన్ స్థానంలో ఉందని.. తెలంగాణలో మాత్రం ఈ పాలసీలు లేవన్నారు.

600 మంది డాక్టర్లను ఏం చేస్తారు...?
కరోనా సమయంలో పని చేసిన 600 మందికి పైగా డాక్టర్లను తీసేయాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోందని.. వారికి మద్దతుగా ఆప్ పార్టీ పోరాడుతుందన్నారు. ఢిల్లీలో ఇచ్చిన హామీలను అరవింద్ కేజ్రీవాల్ నెరవేరుస్తున్నారని.. అంబేద్కర్ చేసిన పనుల గురించి ఢిల్లీలో వీడియోల రూపంలో ప్రచారం చేయడం జరిగిందన్నారు. పంజాబ్‌లో అవినీతి ఉందని, ఇప్పుడు ఆప్ గెలిచిన తర్వాత అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications