సీజనల్ వ్యాధుల దడ.. హెల్త్ డిపార్ట్‌మెంట్ సిద్ధం: మంత్రి హరీశ్ రావు
రోజు వర్షాలు పడుతున్నాయి. దీంతో వరదలు వస్తున్నాయి. కుంటలలో నీరు నిలిచిపోతుంది. దోమలు వృద్ది చెంది అనారోగ్యానికి దారితీస్తోంది. అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ సూచిస్తోంది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. వచ్చే నెల రోజులు ఎంతో కీలకమని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ నుంచి గురువారం జిల్లాల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

అలర్ట్.. అలర్ట్..ః
డెంగీ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి, వెంటనే చికిత్స అందించాలని ఆదేశించారు. అవగాహన పెంచడం, మరోవైపు సత్వర చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. చికిత్స, రోగ నిర్ధారణ పరీక్షల సేవల గురించి అవగాహన కల్పించాలని సూచించారు.

కలిసికట్టుగా..
మున్సిపల్, పంచాయతీ, స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో పారిశుధ్యం పట్ల అవగాహన కల్పించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. నీటి నిల్వ లేకుండా చూడడం, ఫాగింగ్, ఫ్రై డే డ్రై డే కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. దోమలు, ఈగల నియంత్రణ జరిగేలా చూడాలని సూచించారు. వర్షాలు, వరదల సమయంలో జిల్లా వైద్యాధికారులు సమన్వయంతో పని చేశారని, స్టాఫ్ నర్సులు, ఆశా కార్యకర్తలు, ఇతర సిబ్బంది అందరూ మంచి సేవలు అందించారని అభినందించారు.

ఎమర్జెన్సీ మందులు
ప్రతి పీహెచ్‌సీలో కుక్క, పాముకాటు మందులు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. సబ్ సెంటర్ల వారీగా జరుగుతున్న ఎన్‌సీడీ స్క్రీనింగ్ త్వరగా వంద శాతం పూర్తయ్యేలా చూడాలన్నారు. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలను మంత్రి అభినందించారు. వారానికి రెండు, మూడు రోజులు జిల్లాల్లో పర్యటిస్తూ, పురోగతిపై సమీక్షలు నిర్వహించాలని, వచ్చే పది రోజుల్లో వాక్సినేషన్ వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని డీహెచ్ శ్రీనివాస్‌రావును మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో 2,77,67,000 మందిని అర్హులుగా గుర్తించగా, ఇప్పటి వరకు 12,87,411 మందికి బూస్టర్ వేసినట్లు వివరించారు. 20 లక్షల పైగా డోసులు నిల్వ ఉన్నాయని చెప్పారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బూస్టర్ డోస్ అందుబాటులో ఉందని, అన్ని జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ ప్రత్యేకంగా వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలని డీఎంహెచ్‌వోలను ఆదేశించారు.

రోల్ మాడల్
తెలంగాణ డయాగ్నొస్టిక్స్ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచాయనీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ సేవలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. 24 గంటల్లో పరీక్ష ఫలితాలు వచ్చేలా చేసి, మరుసటి రోజు పేషెంట్ ఆ ఫలితాలు వైద్యులకు చూపించే విధంగా ఉండాలన్నారు. సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జీ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఈ విజయ్ కుమార్, వివిధ అరోగ్య కార్యక్రమాల ప్రోగ్రాం ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications