తెరాస వైపు చూపు, డైలమా: సబితా ఇంద్రారెడ్డి వెనుక వైసీపీ చక్రం? ఎందుకంటే..
హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి మంగళవారం నియోజకవర్గంలోని తమ కార్యకర్తలు, అనుచరులతో భేటీ అయ్యారు. ఆమె తెరాసలో చేరుతారని గత కొద్దికాలంగా ప్రచారం సాగుతోంది. అయితే రేవంత్ రెడ్డి, జానారెడ్డి వంటి సీనియర్ల జోక్యంతో కాంగ్రెస్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారని సమాచారం.
ఆమె తెరాసలోకి వెళ్తున్నట్లు ప్రచారం జరగగానే తొలుత ఉత్తమ్, జానా, భట్టి, సుధీర్ రెడ్డిలు రంగంలోకి దిగారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. రాహుల్ గాంధీతోను మాట్లాడించారని తెలుస్తోంది. ఢిల్లీకి రావాలని పార్టీ అధినేత ఆమెకు సూచించారు. దీంతో ప్రస్తుతానికి సబిత మెత్తబడ్డారని తెలుస్తోంది. కానీ ఆమె ఈ రోజు మళ్లీ తన కార్యకర్తలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

జగన్ ఫ్యాక్టర్ ఉందా?
సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారాలని భావించడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో తన తనయుడు కార్తీక్ రెడ్డికి రాజేంద్ర నగర్ టిక్కెట్ రాకపోవడం (పొత్తులో భాగంగా ఆ సీటు టీడీపీకి కేటాయించారు), ఇప్పుడు చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వకపోవడం, రాహుల్ గాంధీ సభలో తమకు ప్రాధాన్యత లేకుండా పోవడం వంటి కారణాలు ఉన్నాయి. దీనికి తోడు వైసీపీ అధినేత వైయస్ జగన్ ఫ్యాక్టర్ కూడా ఉండి ఉంటుందని భావిస్తున్నారు.

జగన్, వైయస్‌లతో అనుబంధం
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి, సబితా ఇంద్రా రెడ్డికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. వైయస్ హయాంలోనే ఆమె కీలకమైన హోంమంత్రి బాధ్యతలు చేపట్టారు. వైయస్ మృతి తర్వాత కూడా జగన్, సబితల మధ్య అదే అనుబంధం కొనసాగింది. జగన్ పార్టీ పెట్టాక, ఆ పార్టీలోకి వెళ్లకపోయినప్పటికీ సబిత, కొండా సురేఖ, శోభా నాగిరెడ్డి వంటి వారితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత కొండా సురేఖ దూరం అయ్యారు. సబితతో మాత్రం పార్టీకి అతీతంగా అదే బంధం కొనసాగుతోంది. అలాగే, జగన్ అక్రమాస్తుల కేసులో ఆమె పేరు కూడా ఉంది.

అసదుద్దీన్‌తో పాటు వైసీపీ
ఇదిలా ఉండగా, ఓ వైపు కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తికి తోడు వైసీపీ మధ్యవర్తిత్వంతో సబిత తెరాసలోకి వెళ్లాలనే ఆలోచన చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. 2014 నుంచే వైసీపీకీ, తెరాసకు మధ్య అంతర్గత ఒప్పందం ఉన్నట్లుగా ప్రచారం సాగింది. 2014లో వైసీపీ నుంచి ఖమ్మంలో ఓ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ తర్వాత వారు తెరాసలో చేరారు. ఆ తర్వాత నుంచి తెలంగాణ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అనధికారికంగా తెరాసకు మద్దతిచ్చింది. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అయితే తెరాస... వైయస్ జగన్‌కు అనుకూలంగా మాట్లాడుతోంది. ఆ రెండు పార్టీల మధ్య సంబంధాలు బహిర్గతమే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పట్ల అసంతృప్తి, మజ్లిస్ అధినేత మధ్యవర్తిత్వానికి తోడుగా వైసీపీ కూడా ఆమెను తెరాసలో చేర్చేలా ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. లేదంటే కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా ఉన్న సబిత ఆ పార్టీని వీడే పరిస్థితి ఉండదని, పలు కారణాలు, ఎందరో సూచన కారణంగానే పార్టీ మారాలని భావిస్తుండవచ్చునని అంటున్నారు. హైదరాబాదులో ఆస్తులు ఉన్న టీడీపీ నేతలను తెరాస ప్రభుత్వం టార్గెట్ చేసి వైసీపీలోకి పంపిస్తుందనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అలాగే తెలంగాణలో మంచి సబంధాలు కలిగిన నేతలతో వైసీపీ మాట్లాడుతుండవచ్చునని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోను తెరాసకు మద్దతు పలికింది. అయితే ఆమె ఇంకా నిర్ణయం తీసుకోలేదు. త్వరలో తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications