టీఆర్ఎస్ బాటలో మరో ఎమ్మెల్యే జాజుల ... కాంగ్రెస్ కు వరుస షాకులా ?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుండి వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీ లోకి వెళుతున్న నేతలను ఆపటంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా విఫలం అవుతున్నారు. ఫలితంగా ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా నుండి ఓ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
టీఆర్ఎస్ బాట పట్టిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు టిఆర్ఎస్ పార్టీ పైన దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. ఎప్పుడు ఏ జిల్లా నుండి ఏ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఒక అనిశ్చితి వాతావరణం నెలకొంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ నేత నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడ టీఆర్ఎస్‌లో చేరనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరుతామని ప్రకటిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 19వ తేదీన కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలోనే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ టీఆర్ఎస్‌లో చేరనున్నారని సమాచారం.

కాంగ్రెస్ నుండి కొనసాగుతున్న వలసలు ... వలసల బాటలో ఇంకెందరో
ఇప్పటికే ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియానాయక్‌లు టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు. గురువారం నాడు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కేటీఆర్ తో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ లో చేరుతానని ఆయన ప్రకటించారు.సబితా ఇంద్రారెడ్డి కూడ టీఆర్ఎస్‌లో చేరుతానని ప్రకటించారు.తాజాగా జాజుల సురేందర్ కూడ టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లా నుండి జాజుల సురేందర్ బాటలో మరి ఇంకెందరు నేతలు నడవనున్నారో అని చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications