రాజా సింగ్‌కు బెయిల్ మంజూరు: హైకోర్టు కీలక షరతులు, పీడీ యాక్ట్ ఎత్తివేత
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే, పలు షరతులు విధించింది. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు రాజా సింగ్‌ను అరెస్ట్ చేసి, జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
దాదాపు రెండు నెలలపాటు(57 రోజులు) జైలులో ఉన్న రాజా సింగ్‌కు బుధవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మీడియాతో కూడా మాట్లాడవద్దని, ఎలాంటి ర్యాలీలు కూడా చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఇతర మతాలను కించపర్చేలా మాట్లాడవద్దని తేల్చి చెప్పింది. అంతేక, రాజాసింగ్‌పై నమోదు చేసిన పీడీ యాక్టును కూడా హైకోర్టు ఎత్తివేసింది.

అంతకుముందు జరిగిన పరిణామాలు
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ భార్య ఉషాబాయి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రెండ్రోజుల క్రితం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిశారు. ఉషాబాయి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావడం ఇదే తొలిసారి. రాజా సింగ్‌ను బయటకు తీసుకొచ్చేందుకు పార్టీ తరపున సాయం అందించాలని ఆమె కోరారు.
తన భర్తపై పార్టీపరంగా విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. తన భర్త హిందూ ధర్మం పరిరక్షణ కోసం పాటుపడుతున్నందు వల్లే తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా జైల్లో పెట్టిందని రాజా సింగ్ భార్య ఈ సందర్భంగా తెలిపారు.
కాగా, రాజా సింగ్‌పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరుతూ జాతీయ నాయకత్వానికి ఇప్పటికే బండి సంజయ్ లేఖ రాశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ పరంగా రాజా సింగ్‌కు న్యాయ సహాయం అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలోనే త్వరలోనే రాజా సింగ్‌పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలనే యోచనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే పార్టీ తరపున రాజా సింగ్‌కు రఘునందన్ రావు, రామచంద్రరావు న్యాయ సహాయం అందిస్తున్నారు. మరోవైపు, బీజేపీ ఇచ్చిన నోటీసుకు ఇప్పటికే రాజా సింగ్ వివరణ ఇచ్చారు. తాను ఏ వర్గాన్ని అవమానించలేదని, పార్టీ లైన్ దాటలేదని వివరణ ఇచ్చారు.
ప్రస్తుతం రాజా సింగ జైలులోనే ఉన్న విషయం తెలిసిందే. రాజా సింగ్ ను విడుదల చేయాలంటూ ఆయనకు మద్దతుగా అభిమానులు పలు బీజేపీ సమావేశాల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. రాజా సింగ్ కు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications