గవర్నర్ దత్తాత్రేయకు అస్వస్థత: అపోలో ఆస్పత్రిలో చేరిక
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అనారోగ్యానికి గురయ్యారు. ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ వెళ్లనున్న ఆయన సడన్ గా అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు ఉదయం ఆయనకు ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే హైదర్‌గూడా అపోలో ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి, అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మరికాసేపట్లో అపోలో డాక్టర్లు ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెత్త్ బులిటెన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న విషయం తెలిసిందే. గతంలో ఆయన కేంద్ర రైల్వే మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా..రెండు సార్లు సేవలందించారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయనకి రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పినట్టు సమాచారం.

తెలంగాణా బీజేపీ నాయకుడయిన బండారు దత్తాత్రేయ చాలా సంవత్సరాలుగా బీజేపీలో కీలక భూమిక పోషించారు. ఇక తాజాగా ఆయనను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించింది కేంద్ర సర్కార్ .హైదరాబాద్ లో ఆయన సొంత నివాసం ఉండటంతో అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు.
Recommended Video

ఉమ్మడి ఏపీలోనూ, విభజన తర్వాత తెలంగాణాలోనూ బండారు దత్తాత్రేయ బీజేపీ సీనియర్ నాయకుడిగా కీలకంగా వ్యవహరించారు. బీజేపీకి విధేయుడిగా ఉన్నారు. ఇక బండారు దత్తాత్రేయ ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ నేతలు అడిగి తెలుసుకుంటున్నారు.