దమ్ముంటే ద్రౌపదిముర్మును ఓడించు, తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళు: కేసీఆర్ కు బీజేపీ సవాల్
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన గురించి, కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి తాజా ప్రెస్ మీట్ లో కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలపై బిజెపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ బారి నుండి దేశాన్ని కాపాడుకుందామని, నాడు తెలంగాణ కోసం పోరాటం చేశానని, నేడు దేశం కోసం పోరాటం చేస్తున్నానని చేసిన వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు, బిజెపి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఇక ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ చేసిన సవాల్ కు ప్రతి సవాల్ విసురుతున్నారు బీజేపీ నేతలు.

ద్రౌపదీ ముర్మును దమ్ముంటే ఓడించాలన్న బీజేపీ తెలంగాణా రథ సారధి
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని, బిజెపి గ్రాఫ్ పెరుగుతుందని అందుకే కేసీఆర్ భయపడుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన బిజెపి బహిరంగ సభ ను చూసి కూడా కేసీఆర్ భయపడుతున్నారని, ముఖ్యమంత్రిగా ఉండి సంస్కర హీనంగా మాట్లాడుతున్నాడని, స్థాయిని మరిచి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాదు రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మును దమ్ముంటే ఓడించాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.

టీఆర్ఎస్ నేతలు ద్రౌపది ముర్మును గెలిపించాలి
ఒక ఎస్సీ మహిళకు రాష్ట్రపతిగా నిలిపిన చరిత్ర బీజేపీదని బండి సంజయ్ స్పష్టం చేశారు. కేసీఆర్ పి వ్యతిరేకత ఉన్న టిఆర్ఎస్ నేతలు ద్రౌపదీ ముర్ముకు ఓటేసి గెలిపించాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు . తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ శనిలా దాపురించిన అని, ఆయన విశ్వాస ఘాతుకానికి పాల్పడుతున్నారు అని, కెసిఆర్ మానవ రూపంలో ఉన్న మృగం అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కెసిఆర్ చైనా మరియు పాకిస్తాన్‌లను ప్రశంసించాడని , సర్జికల్ స్ట్రైక్‌ను ప్రశ్నించాడని బండి సంజయ్ గుర్తు చేశారు.

కరీంనగర్ లో మీ పార్టీకి ప్రజలు బొంద పెట్టింది అందుకే
ఆయుష్మాన్ భారత్, ఫసల్ భీమా తదితర పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదు? అని ప్రశ్నించారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలతో మాట్లాడేందుకు మీరు ఒక్కసారి కూడా ఎందుకు బయటకు రాలేదని నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మీరు కరీంనగర్‌లో "హిందూ గాళ్లు బొందు గాళ్లు" అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడినందుకు అక్కడి ప్రజలు మీ పార్టీని సమాధి చేశారని వ్యాఖ్యానించారు .

జోగులాంబపై వ్యాఖ్యలా .. నీ టైం దగ్గర పడింది
సీఎం కేసీఆర్ శక్తి పీఠమైన జోగులాంబపై వ్యాఖ్యానిస్తున్నారు. మీ రోజులు దగ్గరపడ్డాయి అంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, సీఎం కేసీఆర్‌కు మధ్య చాలా తేడా ఉందని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ పేర్కొన్నారు. మీరు దేశ్ కీ నేతా.. అంటూ ప్రశ్నించిన బండి సంజయ్ మీకు ప్రధాని మోదీకి పోలిక ఎక్కడని ప్రశ్నించారు. ప్రధాని మోదీ రోజుకు 18 గంటలు పనిచేస్తారు, కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి కూడా బయటకు రారు అంటూ వ్యాఖ్యానించారు. మీరే దేశ్ కీ నేత అని చెప్పుకోవడం చూసి అందరూ నవ్వుతున్నారన్నారు .

ముందస్తుకు వెళ్లాలని సవాల్ చేసిన బీజేపీ నేతలు
ఇక ఇదే సమయంలో దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఒక బండి సంజయ్ మాత్రమే కాకుండా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ కెసిఆర్ కు తన ప్రభుత్వం తన విధానాలపై నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేస్తూ ముందుకు వెళ్లాలని తాము కూడా సిద్ధంగా ఉన్నాం అంటూ సవాల్ విసిరారు. ఇక ప్రజలు కూడా అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి కళ్లలో వత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు అంటూ పేర్కొన్నారు.