బీజేపీ ఎంఎన్‌సీ లాంటి పార్టీ, సంస్థలను విక్రయిస్తూ.. అంబానీ, అదానీ కోసమే: భట్టి విక్రమార్క
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ఈడీ విచారిస్తోంది. దీనిని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు సత్యగ్రహ దీక్ష చేపట్టారు. గాంధీభవన్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర నేతలు పాల్గొన్నారు. దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రధాని మోడీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని,పెట్రోల్ డీజిల్, పసిపిల్లలు తాగే పాలపై కూడా జీఎస్టీ విధించడం సరికాదన్నారు.

సంస్థలకు విక్రయిస్తూ..
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అధికారంలోకి వచ్చారని, తర్వాత ఆ సంగతే మరిచారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొల్పిన ప్రభుత్వ రంగ సంస్థలను, ఇతర సంపదను అమ్ముతూ ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తున్నారని ఫైరయ్యారు. 80 లక్షల కోట్ల అప్పులు చేసి దేశాన్ని మోడీ తాకట్టు పెట్టారని తెలిపారు. బీజేపీ అనేది మల్టీ నేషనల్ కంపెనీ లాంటి పార్టీ అని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ అమ్మేస్తున్నారని తెలిపారు.

మోడీ, అమిత్ షా.. అదానీ, అంబానీ దన్ను
మోడీ అమిత్ షాకు అదానీ, అంబానీ దన్నుగా నిలిచారని తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసు మూసేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారని తెలిపారు. సోనియా, రాహుల్ గాంధీను కక్షపూరితంగా ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని తెలిపారు. తమ నిరసన దీక్ష సోనియా, రాహుల్ గాంధీ కోసమే కాదు.. కోట్లాది ప్రజల కోసం అని చెప్పారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని దేశం నుంచి ఏ విధంగా పారద్రోలమో అలాగే బీజేపీని కుల్చుతామని వివరించారు. సోనియా గాంధీ ప్రధాని పదవీని తృణప్రాయంగా త్యాగం చేసిందని గుర్తుచేశారు.

సామాజిక మార్పు కోసం..
కాంగ్రెస్ పనిచేసేది అధికారం కోసం కాదు. సామాజిక మార్పు కోసం అని చెప్పారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పత్రికకి కాంగ్రెస్ పార్టీ డబ్బులను అప్పుగా ఇచ్చింది. ఇందులో ఎక్కడ మనీ ల్యాండరింగ్ జరిగిందని అడిగారు. రాహుల్, సోనియాకి మద్దతుగా నిలిచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీగా నవభారత నిర్మాణం చేసిన కాంగ్రెస్ పార్టీగా దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం తమపై ఉందన్నారు.












Click it and Unblock the Notifications