ఆ హామీలు ఏవీ.. నీటి మూటలయినా మాటలు: విజయశాంతి
అధికార టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నేత విజయశాంతి మరోసారి రెచ్చిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పిన బీసీ పాలసీ ఇప్పుడు పత్తా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన అసెంబ్లీలో బీసీ ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశాలు మూణ్నాళ్ల ముచ్చటే అయ్యాయని పేర్కొన్నారు. ఆ సమావేశాల్లో 210 తీర్మానాలు చేసి ఆమోదించారని, ఇప్పుడవన్నీ అటకెక్కాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీ పాలసీ వస్తే అన్ని రంగాల్లో ముందుకెళ్లవచ్చని భావించిన బీసీలకు నిరాశే మిగిలిందని విజయశాంతి వివరించారు. ఏదో చేయబోతున్నట్టు అప్పట్లో హైప్ సృష్టించి, 2018 ఎన్నికల్లో గెలిచాక ఆ తీర్మానాలను మూలనపడేశారని ఆమె ఆరోపించారు. ఇప్పుడు కులవృత్తుల పేరుతో ప్రజలను మళ్లీ పాతాళానికి నెట్టివేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ దళిత ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

గతంలో దళితులకు మూడెకరాలు ఇస్తామనే హామీతోపాటు, అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు హామీని కూడా తుంగలో తొక్కారని విజయశాంతి గుర్తుచేశారు. ఇప్పుడు దళిత సాధికారత అంటూ దళిత బంధు అనే పథకంతో దళితులను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు, బీసీలను రాష్ట్ర సర్కారు మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆమె గుర్తుచేశారు. హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపించి టీఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడతారని విజయశాంతి స్పష్టం చేశారు.
రాష్ట్రం ప్రభుత్వం చెప్పేదీ ఒకటి చేసేదీ ఒకటి అని విజయశాంతి మండిపడ్డారు. ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరగాల్సిన అవసరం ఉందన్నారు. కానీ అప్పులు చేస్తూనే.. సంపద సృష్టిస్తున్నామని కబుర్లు చెబుతున్నారని వివరించారు. ఇటు పేదలు మరింత పేదలుగా మారుతూనే ఉన్నారని ధ్వజమెత్తారు. లక్షల కోట్ల బడ్జెట్.. ప్రజాధనం ఎక్కడికీ వెళుతుందని ఆమె అడిగారు. ఇవ్వన్నీ సమాధానం లేని ప్రశ్నలుగానే మిగులుతాయని వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాయ చేస్తోందని.. ప్రజలను నయవంచనకు గురిచేస్తోందని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications