జీహెచ్ఎంసీ ఎన్నికలు : బీజేపీ మహిళా నేత ఆత్మహత్యాయత్నం... టికెట్ దక్కకపోవడంతో..
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ విషాదం చోటు చేసుకుంది. బీజేపీ నాచారం డివిజన్ టిక్కెట్ దక్కలేదన్న మనస్తాపంతో అనుముల విజయలతా రెడ్డి అనే మహిళా నేత ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్ర మాత్రలు మింగి ఆమె ఆత్మహత్యకు యత్నించడంతో... హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రమాదమేమీ లేదని వైద్యులు చెప్పారు. విజయలతారెడ్డి 2016లో బీజేపీ అభ్యర్థిగా నాచారం డివిజన్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ టిక్కెట్ ఇవ్వకుండా మోసం చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల అభ్యర్థుల తొలి జాబితా సందర్భంగా హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. గోశామహల్ టికెట్‌ను సీనియర్ నేత లక్ష్మణ్ కాంగ్రెస్ నుంచి వచ్చిన తన బావమరిదికి ఇచ్చారని ఆరోపిస్తూ కార్యకర్తలు నిరసనకు దిగారు.లక్ష్మణ్‌కు వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు.

జియగూడా టికెట్ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు తనయుడు సాయికి కేటాయించడం కూడా వివాదంగా మారింది. ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి.. తన వర్గానికి రెండు మూడు డివిజన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తుండటం కూడా పార్టీలో వివాదం రేపుతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
ఇక టీఆర్ఎస్ విషయానికొస్తే... ఖైరతాబాద్ డివిజన్ టికెట్ తనకే దక్కుతుందని ఆశించిన మాజీ కార్పోరేటర్ బి.భారతికి భంగపాటు తప్పలేదు. సిట్టింగ్ కార్పోరేటర్ మన్నె కవితకే మరోసారి అధిష్టానం అవకాశం కల్పించింది. దీంతో పార్టీపై ఆమె అలిగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే దానం నాగేందర్, అభ్యర్థి మన్నె కవిత, ఇన్‌చార్జి ఎమ్మెల్సీ భానుప్రసాద్‌లు భారతి ఇంటికి చేరుకుని ఆమెను బుజ్జగించారు. ఈ సందర్భంగా ఆమె కన్నీంటిపర్యంతమయ్యారు. నేతల బుజ్జగింపుతో ఆమె అలక వీడారు. అభ్యర్థి కవితకు పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications