గ్రేటర్ ఎన్నికల సమరం... ఏ క్షణమైనా షెడ్యూల్ వచ్చే ఛాన్స్.. పోలింగ్ తేదీ ఎప్పుడంటే?
రాష్ట్రంలో మరో ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. అతి త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఎన్నికల కమిషన్ ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.డిసెంబర్ 6న గ్రేటర్ ఎన్నికలకు పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అది బ్లాక్ డే కావడంతో ఆరోజు ఎన్నికలు నిర్వహించకపోవచ్చు. ఆ తేదీకి కాస్త అటు,ఇటుగా ఎన్నికలు జరగవచ్చు. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం 15 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి డిసెంబర్ మొదటివారంలో ఎన్నికలు చేపట్టాలంటే..రాబోయే నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది.

వరద బాధితులకు సహాయంతో.. షెడ్యూల్ ఆలస్యం...
నిజానికి ఈ నెల 17 లేదా 22 తేదీల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడవచ్చునన్న ప్రచారం జరిగింది. అయితే నగరంలో వరద ముంపు బాధితులకు ఆర్థిక సహాయం నేపథ్యంలో... మరో 2,3 రోజుల గడువు అనంతరం ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్ని ఎన్నికల సన్నాహక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. ఆయా నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించి ఎన్నికల బాధ్యతలను అప్పగించాయి.

దుబ్బాక ఓటమిని మరిపించాలనుకుంటున్న టీఆర్ఎస్...
దుబ్బాక ఓటమి నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక ఓటమిని మరిపించాలంటే గ్రేటర్‌లో కచ్చితంగా 100 పైచిలుకు స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా దుబ్బాకలో బీజేపీ గెలుపు స్థానిక అభ్యర్థి రఘునందన్ రావుపై ఉన్న సానుభూతే తప్ప.. అది బీజేపీ బలం కాదని నిరూపించాలనుకుంటోంది. ఇందుకోసం ఎమ్మెల్యేలకు టార్గెట్లు ఫిక్స్ చేసింది. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అన్ని డివిజన్లు టీఆర్ఎస్ ఖాతాలోనే చేరాలని ఎమ్మెల్యేలను ఆదేశించింది.

ఊపు మీద బీజేపీ...
దుబ్బాక ఉపఎన్నికలో గెలుపుతో అటు బీజేపీ కూడా ఊపు మీద ఉన్నది. ఒకవేళ అక్కడ బీజేపీ బోల్తా కొట్టి ఉంటే.. గ్రేటర్‌లో ఆ పార్టీని టీఆర్ఎస్ లైట్ తీసుకుని ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్... జీహెచ్ఎంసీ ఎన్నికలు దేశ ద్రోహులకు,దేశభక్తులకు మధ్య యుద్దం అంటూ ఇప్పటికే అగ్గి రాజేశారు. ఎంఐఎంతో అంటకాగుతున్న టీఆర్ఎస్‌కు బుద్ది చెప్పి తీరుతామని అంటున్నారు. దుబ్బాక తరహాలోనే గ్రేటర్‌లోనూ అనూహ్య ఫలితాలు సాధించి టీఆర్ఎస్‌కు షాకివ్వాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు బీజేపీ దూకుడుకు గ్రేటర్‌లో ఎలాగైనా అడ్డుకట్ట వేయాలన్న ప్లాన్‌లో టీఆర్ఎస్ ఉన్నది. దీంతో గ్రేటర్ ఎన్నికలు కూడా రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
Recommended Video

కాంగ్రెస్ సత్తా చాటేనా?
దుబ్బాకలో వెనుకబడ్డ కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఒకవేళ గ్రేటర్‌లోనూ కాంగ్రెస్ బీజేపీ కంటే వెనుకబడితే... ఆ పార్టీ ఉనికికే ప్రమాదం తలెత్తే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న కసితో ఆ పార్టీ ఉంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్,బీజేపీలు ముందస్తు ప్రచారంలో దూసుకుపోతుండగా... కాంగ్రెస్ పార్టీ కాస్త వెనుకబడినట్లే కనిపిస్తోంది. దానికి తోడు జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ కీలక నేతలకు బీజేపీ గాలం వేస్తోంది. ఈ నేపథ్యంలో అటు అధికార టీఆర్ఎస్,ఇటు బీజేపీల దూకుడును తట్టుకుని కాంగ్రెస్ ఎంతమేర సత్తా చాటుతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications