ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల కాంట్రవర్సీ: తొలిసారి శాసనమండలిలో.. కేసీఆర్ సర్కార్ ను తిట్టారా? పొగిడారా?
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా శాసనమండలిలో కెసిఆర్ తనయ, కల్వకుంట్ల కవిత ప్రసంగించారు. ఈ సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. మండలిలో తొలిసారిగా మాట్లాడిన కవిత ఎంపీటీసీ, జడ్పిటిసి సభ్యుల సమస్యలపై ప్రస్తావించారు. మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ సభ్యుల గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు కనీసం కూర్చోవడానికి కూడా కుర్చీ లేదన్న కవిత
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై శాసనమండలిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ప్రభుత్వం దృష్టికి కొన్ని సమస్యలను తీసుకొస్తున్నానని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. గతంలో కూడా అనేక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్ళామని పేర్కొన్నారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు కనీసం కూర్చోవడానికి కూడా కుర్చీ లేదని ఆమె శాసనమండలి వేదికగా ప్రశ్నించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దీనిపై చొరవ తీసుకుని ఎంపీటీసీలు, జడ్పీటీసీల సమస్యలను పరిష్కరించాలని కవిత సూచించారు. రాష్ట్రంలో కొత్తగా మండలాలు ఏర్పాటైనా ఇప్పటివరకు ఎంపీపీలకు తగిన కార్యాలయాలు లేవని కవిత సభాముఖంగా పేర్కొన్నారు.

చట్ట సవరణ చేసైనా స్కూల్స్ లో జెండా ఎగురవేసే అవకాశం ఇవ్వాలి
రోజు వారి అధికారిక విధుల నిర్వహణలో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. చట్టానికి సవరణ చేసైనా సరే ఎంపీటీసీ, జడ్పిటిసి సభ్యులకు పాఠశాలల్లో జెండా ఎగరేసే అధికారం కల్పించాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలలో కనీసం ఎంపీటీసీలు కూర్చోవటానికి కుర్చీలు కూడా లేవని ఈ విషయంలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అంతేకాదు కేంద్రం 15వ ఫైనాన్స్ కమిషన్ లో స్థానిక సంస్థలకు ఐదు వందల కోట్ల రూపాయల లోటు పెట్టినా మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ సభ్యుల గౌరవాన్ని కాపాడడం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అదనంగా ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు అంటూ కవిత పేర్కొన్నారు.

తమ పరిస్థితిపై ఆందోళనలు చేసిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు
ఇప్పటివరకు ఎంపీటీసిలు, జడ్పీటీసిలు తమ పరిస్థితులపై అనేకమార్లు ఆందోళనలు చేశారు. ప్రభుత్వం పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనేకమార్లు బాహాటంగానే ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇక ఏకంగా హుజురాబాద్ లో పెద్ద సంఖ్యలో ఎన్నికల బరిలోకి దిగాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇంతా జరుగుతున్నా కేసీఆర్ సర్కార్ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ సమయంలో వారి పక్షాన కవిత ప్రభుత్వానికి విజ్ఞప్తి చెయ్యటం ఆసక్తికరంగా మారింది.

ఎంపీటీసీల, జడ్పీటీసిల పరిస్థితిపై కవిత వ్యాఖ్యలు .. పాలనపై అసంతృప్తితోనేనా .. చర్చ
సంక్షేమ పథకాల అమలు చేయడంలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని తెలంగాణ మంత్రులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని టిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఎంపీటీసీలు జడ్పిటిసి ల గౌరవం కాపాడటం కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించిందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నా రాష్ట్రంలో ఎంపీటీసీలు, జడ్పిటిసి లకు కూర్చోడానికి కుర్చీలు కూడా లేని పరిస్థితి పై ఆమె చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ సర్కార్ పాలన ఏ విధంగా ఉందో చెప్పకనే చెబుతుంది అని ప్రతిపక్ష పార్టీల నేతలు చెబుతున్నారు. కెసిఆర్ కూతురు కవితనే, కేసీఆర్ సర్కారు పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
Recommended Video

కవిత వ్యాఖ్యలపై అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారంటున్న టీఆర్ఎస్ నాయకులు
అయితే టీఆర్ఎస్ నాయకులు ఎంపీటీసి, జడ్పీటీసీల విషయంలో కవిత ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకొచ్చారని, అంతే తప్ప కేసీఆర్ పాలన బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చెయ్యలేదని అంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు దీనిని వక్రీకరిస్తున్నారని మండిపడుతున్నారు. ఎమ్మెల్సీ కవిత ప్రజా ప్రతినిధిగా తన బాధ్యత నిర్వర్తించారని అంటున్నారు. అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications