కేసీఆర్ ట్రాప్‌లో పడొద్దు.. మీడియా మిత్రులకు షర్మిల సజెషన్
సమయం దొరికితే చాలు.. వైఎస్ షర్మిల కూడా రెచ్చిపోతున్నారు. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో జరుగుతున్న అన్యాయాన్ని చెబుతున్నారు. ఆమె ప్రధానంగా నిరుద్యోగుల గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నారు. బంగారు తెలంగాణలో నిరుద్యోగులకు ఆత్మహత్యే శరణ్యం అవుతోందని చెప్పారు. ఇప్పటికే చాలా మంది చనిపోతున్నారని.. కేసీఆర్ దొర కళ్లు తెరవాలని కోరారు.
నిరుద్యోగులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని షర్మిల విమర్శించారు. మీడియా మిత్రులారా దయచేసి కేసీఆర్ ట్రాప్ లో పడొద్దని కోరారు. 56,979 కొలువులేవీ? అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలే కాకుండా కొత్త జిల్లాల ప్రకారం అవసరమైన ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయాల్సిందేనని చెప్పారు. మీడియా మిత్రులు నిరుద్యోగుల ఆశలను చంపవద్దని కోరారు. అన్ని ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడంలో నిరుద్యోగుల పక్షాన నిలబడాలని అన్నారు.

నిరుద్యోగులకు మీరు ఉద్యోగాలను బిచ్చమేస్తున్నారా లేక దానం చేస్తున్నారా కేసీఆర్ గారూ? అని షర్మిల ప్రశ్నించారు. పార్టీ నేతలకు పదవులను బిస్కెట్ వేసినట్టు ఇస్తున్నారా? అని అడిగారు. ఈ రోజు కాంట్రాక్టు ఉద్యోగాలతో నెట్టుకొస్తానంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను పర్మినెంట్ గా భర్తీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఇటు యువకులు, విద్యార్థులు, మేధావులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను.. నిరంకుశ కేసీఆర్ చేతిలో పెట్టి మోసపోయామని వైఎస్ షర్మిల అన్నారు. నిన్న మంచిర్యాల జిల్లా దండెపల్లిలో జరిగిన నిరుద్యోగ నిరహార దీక్షలో షర్మిల పాల్గొన్నారు. ఉద్యమకారుడనే ఉద్దేశంతో ఉద్యమ ఆకాంక్షలను నెరవేరుస్తాడనే నమ్మకంతో కేసీఆర్ చేతిలో అధికారం పెట్టామని చెప్పారు. విద్యార్థులను, యువకులను ఉరికంబం ఎక్కిస్తున్నాడని.. ఉద్యమ సమయంలో ముందుండి పోరాటం చేసిన విద్యార్థులు, యువకులను నేడు బలిపీటం ఎక్కిస్తున్నాడని ఫైరయ్యారు. వందల సంఖ్యలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. దున్నపోతు మీద వానపడట్టు మరణించేవాళ్లు మన వాళ్లు కాదు కదా.. నా ఇంట్లో అయిదు ఉద్యోగాలు ఉన్నాయని కేసీఆర్ మురిసిపోతున్నాడని మండిపడ్డారు. ఫాం హౌజ్‌లో మత్తునిద్రలో ఉన్న కేసీఆర్‌కు రాష్ట్రంలో ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారో కూడా తెలియదన్నారు. ఎంతమందికి గ్రాడ్యుయేట్లు ఉన్నారు? ఎంతమంది ఉద్యోగాలు కోరుకుంటున్నారో కనీస అవగాహన లేదన్నారు. కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప టీఎస్ పీఎస్సీకి సభ్యులను నియమించలేదన్నారు. కేసీఆర్ ఉద్యోగాలు భర్తీ చేస్తాడనే నమ్మకం ప్రజల్లో లేకుండా పోయిందని చెప్పారు.












Click it and Unblock the Notifications