దిల్ రాజు తెలివే తెలివి.. అందుకే పెద్ద నిర్మాతయ్యాడు??
ఈనెల 27వ తేదీన ఎఫ్ 3 సినిమాను విడుదల చేయబోతున్న దిల్ రాజు థియేటర్లలో టికెట్ ధరలు పెంచమని ఏపీ ప్రభుత్వాన్నికానీ, తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ కోరలేదు. ఎందుకంటే ధరలు పెంచితే ఆచార్య, సర్కారువారిపాట సినిమాలకు ఎటువంటి గతి పట్టిందో అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 సినిమా నిర్మాతలు భారీగా ఖర్చుపెట్టారు కాబట్టి, అందుకు తగ్గ కలెక్షన్ల కోసం ప్రభుత్వాలతో మాట్లాడుకొని టికెట్ ధరలు పెంచుకున్నారు.

సినిమాలు కూడా బాగుండటంతో ఆదరించారు
సినిమాలు కూడా బాగా తీయడంతో ప్రేక్షకులు ఆదరించారు. అందుకు తగ్గట్లుగా థియేటర్లకు ప్రేక్షకులు కూడా తరలి వచ్చారు. వాటి కలెక్షన్లు కూడా అలాగే వచ్చాయి. కానీ అన్ని సినిమాలకు అలా కాదు. చాలామంది నిర్మాతలు ఇక్కడే పప్పులో కాలేస్తున్నారు. చేతులు కాల్చుకుంటున్నారు. థియేటర్ టికెట్ ధరలు పెంచుకోవడంవల్ల మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుబాలు సినిమా థియేటర్లకు రావడం మానేశాయి.

ఓటీటీలో వస్తుందిగా.. అప్పుడు చూద్దాంలే!!
ఓటీటీలకు అలవాటు పడిపోయారు. మూడువారాలో, నాలుగు వారాలో ఆగితే నేరుగా ఓటీటీలోనే వచ్చేస్తోంది.. అప్పుడు చూడొచ్చులే అనుకుంటున్నారు. పెరిగిన ధరల్లో సినిమా చూడాలంటే ఒక్కో కుటుంబానికి రూ.2వేల ఖర్చవుతోంది. ఒక కుటుంబం ఒక సినిమా చూడటానికి వెళ్లి అంత బడ్జెట్ పెట్టాలంటే సాధారణ విషయం కాదు. దీంతో థియేటర్లకు వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. సరదాగా స్నేహితులతో కలిసి సినిమా చూసేవారు కూడా థియేటర్లకు రావడ మానేశారు.

ధరలు పెంచితే అసలుకే మోసం వస్తుందని గుర్తించిన దిల్ రాజు
ఏదైనా అందుబాటులో టికెట్ ధరలుంటే సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారు. లేదంటే ఎంత పెద్ద కథానాయకుడి సినిమా అయినా ఆసక్తి చూపమని ప్రేక్షకులు ఇప్పటికే నిరూపించారు. దీంతో ఎఫ్ 3ని విడుదల చేయాలనుకున్న దిల్ రాజు ఆలోచనలో పడిపోయారు. ధరలు పెంచడంవల్ల అసలుకే మోసం వస్తోందని గుర్తించిన రాజు కొద్ది రోజులుగా ఎఫ్ 3 సినిమాకు టికెట్ ధరలు పెంచడంలేదని, మాములు ధరలే ఉంటాయని అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని కోరుతున్నారు.

టికెట్ ధరలు తగ్గించామన్న వార్త ప్రేక్షకులకు అంతగా చేరువ కావడంలేదు
టికెట్ ధరలు పెంచుకున్నారు.. అన్నవార్త ప్రేక్షకుల్లోకి వేగంగా వెళ్లింది.. కానీ టికెట్ ధరలు పెంచడంలేదు అన్న వార్త మాత్రం అంత వేగంగా వెళ్లలేకపోతోంది. ఇప్పటికే మీడియా సమావేశాలు పెట్టి మరీ దిల్ రాజు థియేటర్లలో టికెట్ ధరలు పెంచడంలేదని చెబుతున్నారు. మరి ప్రేక్షకులు ఎంతవరకు థియేటర్లకు తరలి వస్తారో తెలియాలంటే 27వ తేదీ వరకు వేచిచూడక తప్పదు మరి..!!