అంబర్‌పేట కుక్కల దాడిలో బాలుడు మృతి: ఆ కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం
హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో ఇటీవల వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు ప్రదీప్ కుటుంబానికి జీహెచ్ఎంసీ పరిహారం ప్రకటించింది.
హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేటలో ఇటీవల వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు ప్రదీప్ కుటుంబానికి జీహెచ్ఎంసీ పరిహారం ప్రకటించింది. జీహెచ్ఎంసీ నుంచి రూ. 8 లక్షలు, కార్పొరేటర్ల నెల జీతం నుంచి రూ. 2 లక్షలు కలిపి మొత్తం రూ. 10 లక్షలు ఇవ్వాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
ప్రదీప్ మృతి చెందిన ఘటనను హైకోర్టు ఇప్పటికే సుమోటో పిటిషన్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్. తుకారాంజీలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్, లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది.

పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కుక్కలు వీధుల్లో తిరగకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారో.. కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని ఆదేశించింది. కుక్కల దాడిలో మృతి చెందిన ఘటన పరిహారానికి అర్హమైన కేసు అని, బాలుడి తల్లిదండ్రులకు పరిహారం అంశాన్ని వచ్చే విచారణలో పరిశీలిస్తామని.. విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ.. ఆ బాలుడి తల్లిదండ్రులకు పరిహారం ప్రకటించడం గమనార్హం.
వీధి కుక్కల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే జీహెచ్ఎం సీ మేయర్ ప్రకటించారు. అయితే, ఇప్పటికీ కూడా ప్రతిరోజూ ఏదో ఒక చోట కుక్క దాడిలో గాయపడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా, నాచారంలో ఓ బాలుడిని రెండు వీధి కుక్కలు దాడి చేసి గాయపర్చాయి. అయితే, సకాలంలో కుటుంబసభ్యులు రావడంతో పెను విషాదం తప్పింది.












Click it and Unblock the Notifications