కూకట్‌పల్లిలో దారుణం... దుర్గామాత ఆలయంలో విధ్వంసం, శునకానికి ఉరి...
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. స్థానిక దుర్గామాత ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు పెకిలించివేశారు. ఆలయం వెలుపల వున్న నాగదేవత విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆలయం పక్కనే ఓ శునకాన్ని ఉరివేసి చంపారు. ఘటన గురించి తెలియగానే మూసాపేట్ బీజేపీ కార్పోరేటర్ మహేందర్ అనుచరులతో కలిసి ఆలయం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. పలువురు భజరంగ్ దళ్ కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆలయం వద్దకు వచ్చి పరిశీలించారు. దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి అరెస్టు చెయ్యాలని పోలీసులను ఆదేశించారు. ఆలయంలో తిరిగి విగ్రహాలను ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధి చేసేందుకు గాను రూ.5లక్షలు ప్రకటించారు.

ఓవైపు ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న సమయంలోనే... కూకట్‌పల్లిలోనూ అదే తరహా ఘటన వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications