fisherman minister harish rao vehicles talasani srinivas yadav మత్స్యకారులు మంత్రి హరీశ్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎం కేసీఆర్
గోల్డెన్ డేస్: మత్య్సకారులకు వరం, మంత్రి హరీశ్ రావు
మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. 117 సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంచి ఆలోచన చేశారని చెప్పారు. చేపలు తినాలని ఉన్న హైదరాబాద్‌లో ఒకటి రెండు చోట్ల మాత్రమే లభిస్తాయని.. అందరూ తినే అవకాశం లేదన్నారు.

సంచార చేపల విక్రయ వాహనాలు..
సంచార చేపల విక్రయ వాహనాలతో చాలా మంది వినియోగదారులకు ఉపయోగం ఉంటుందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. 150 డివిజన్లలో 150 వాహనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మత్స్య పరిశ్రమ అంటే కోస్తా మాత్రమే గుర్తుకు వచ్చేది కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగిందని స్పష్టం చేశారు. తెలంగాణలో చెరువులకు మహర్దశ వచ్చిందన్నారు.

వేసవిలో మత్తళ్లు దుంకుతున్నాయి..
నిండు వేసవిలో చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. గొల్ల కురుమలకు గొర్రె పిల్లలు, మత్స్యకారులకు చేపలను ఉచితంగా ఇస్తున్నామని మంత్రి హరీష్‌రావు చెప్పారు. సీఎం కేసీఆర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం చేపట్టాలని బడ్జెట్‌లో నిధులు కేటాయించారన్నారు. సీఎం కేసీఆర్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లకు 500 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాలకు ఈ వాహనాలు ఇవ్వాలని కేసీఆర్‌ని కోరామని మంత్రి హరీష్‌రావు చెప్పారు.

ఆరు కుటుంబాలకు ఉపాధి
వాహనాల ద్వారా 5 నుంచి ఆరు కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మత్స్యకారులు దురదృష్టవశాత్తు చనిపోతే ప్రభుత్వం 6 లక్షల రూపాయలను ఎక్స్ గ్రేషియా ఇస్తుందని చెప్పారు. భవిష్యత్‌లో చేపల పరిశ్రమకు సంబంధించి పలు పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, అరికెపుడి గాంధీ, భేతి సుభాష్‌రెడ్డి, ఎంపీలు బండ ప్రకాష్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ శ్రీలత , స్థానిక కార్పొరేటర్ విజయరెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా అధికారులు పాల్గొన్నారు.