రాజ్‌భవన్ ముట్టడి ఉద్రిక్తం: బస్సు అద్దాలు ధ్వంసం, బైక్ దహనం, రేవంత్ సహా నేతల అరెస్ట్
హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ జరపడాన్ని నిరసిస్తూ గురువారం తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి రాజ్ భవన్ వరకు భారీగా చేరుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు.
ఖైరతాబాద్ జంక్షన్ లో ఉద్రిక్తత: బైక్ దగ్ధం, బస్సు అద్ధాలు ధ్వంసం
ఈ క్రమంలో ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేతలు ఓ ద్విచక్ర వాహనానికి రోడ్డుపైనే నిప్పుపెట్టి తగలబెట్టారు. అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆపి బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అంతేగాక, బస్సుపైకి ఎక్కి నినాదాలు చేశారు. దీంతో ప్రయాణికులు అక్కడ్నుంచి వేరే మార్గాల్లో తమ గమ్యస్థానాలకు బయల్దేరారు. కాంగ్రెస్ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. రాజ్ భవన్ మార్గంలో పోలీసులు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున భారీకేడ్లు ఏర్పాటు చేశారు. అయినా వాటిని తొలగించి కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ వైపు ముందుకు కదిలారు. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విధ్వంసానికి పోలీసుల వైఖరే కారణమంటూ జగ్గారెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, గీతారెడ్డి, భట్టి విక్రమార్క, అంజన్ కుమార్ యాదవ్ తదితర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో భారీ ఎత్తున కాంగ్రెస్ నేతలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేతల ఆందోళన కొనసాగుతోంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. కాగా, కాంగ్రెస్ నేతలు చేసిన విధ్వంసానికి పోలీసుల వైఖరే కారణమని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.
డీసీపీ చొక్కా పట్టుకున్న భట్టి
అరెస్టు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పోలీసులతో వాగ్వాదానికి దిాగారు. అంతేగాక, డీసీపీ జోయెల్ డేవిస్ చొక్కా పట్టుకుని తోసేశారు. ఆ తర్వాత పోలీసులు భట్టిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రోడ్డుపై బైఠాయించడంతో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో పోలీసులకు, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఎస్ఐ చొక్కా పట్టుకున్న రేణుకా చౌదరి, మహిళా పోలీసులను కొట్టారు
రాజ్ భవన్ వైపు వెళుతున్న కాంగ్రెస్ నేత రేణుకా చౌదరిని పోలీసులు అడ్డుకోవడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, అక్కడున్న పంజాగుట్ట ఎస్ఐ చొక్కా పట్టుకుని.. పోలీస్ స్టేషన్ కు వచ్చి కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు రేణుకా చౌదరి. అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన మహిళా పోలీసులపై రేణుకా చౌదరి చేయి చేసుకున్నారు. ఆ తర్వాత రేణుకను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల పట్ల దురుసు ప్రవర్తించిన క్రమంలో రేణుకా చౌదరి, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications