Corbevax: త్వరలో బూస్టర్ డోస్: హైదరాబాదీ ఫార్మా కంపెనీకి కేంద్రం అనుమతి
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన టాప్ ఫార్మాసూటికల్స్ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను విస్తృతంగా వినియోగిస్తోన్నారు. దేశీయంగా తయారైన మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్ ఇదే. తాజాగా- బూస్టర్ డోస్ అభివృద్ధికి కూడా హైదరాబాద్ కేంద్రబిందువుగా మారింది. బూస్టర్ డోసుల కోసం మరో దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు.
బూస్టర్ డోసులు కూడా భారత్ బయోటెక్ నుంచి రానున్నాయి. దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను ఇదివరకే చేపట్టిందీ సంస్థ యాజమాన్యం.హైదరాబాద్‌కే చెందిన మరో ఫార్మాసూటికల్స్ కంపెనీ బయోలాజికల్-ఈ అభివృద్ధి చేసిన కోర్బెవ్యాక్స్ బూస్టర్ డోసుల క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి ఈ సంస్థ యాజమాన్యం అందజేసిన ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసింది. ఈ సందర్భంగా రెండు షరతులను విధించింది.

మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించాల్సి ఉంది. ఇవి ముగిసిన వెంటనే బూస్టర్ డోసులను అందుబాటులోకి తీసుకొస్తామని బయోలాజికల్-ఈ వెల్లడించింది. భారత్ బయోటెక్ తరువాత బూస్టర్ డోసుల కోసం అనుమతి పొందిన రెండో ఫార్మాసూటికల్స్ కంపెనీ.. బయోలాజికల్-ఈ. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు డీసీజీఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఆరు నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో రోగనిరోధక శక్తిపై అధ్యయనం చేయాలని సూచించింది.
బూస్టర్ డోసులను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. జనవరి 10వ తేదీ నుంచి ఇవి దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి తొలి ప్రాధాన్యత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. తొలిదశలోనే ఫ్రంట్‌లైన్ వర్కర్లకూ బూస్టర్ డోస్‌ను అందజేస్తుంది. దీనితోపాటు- వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంలో భాగంగా మరో రెండు కొవిడ్ టీకాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
కోర్బెవ్యాక్స్‌తో పాటు సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తోన్న కోవోవ్యాక్స్ వ్యాక్సిన్లకు సైతం షరతులతో కూడిన అత్యవసర వినియోగ అనుమతులను ఇచ్చింది. మోల్నుపిరవిర్‌కు కూడా షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఈ రెండూ త్వరలోనే వ్యాక్సినేషన్ కార్యక్రమంలో చేరనున్నాయి. మోల్నుపిరవిర్ యాంటీవైరల్ కొవిడ్ టాబ్లెట్. దీన్ని అమెరికాకు చెందిన రిడ్జ్‌బ్యాక్ బయో థెరప్యూటిక్స్, మెర్క్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.












Click it and Unblock the Notifications