రేపే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం: ఊరేగింపుగా సాగర్‌కు, సీపీ అంజనీకుమార్ సూచనలు
హైదరాబాద్: తెలుగు ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఖైరతాబాద్ గణపతి ఊరేగింపు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. పోలీసుల బందోబస్తు మధ్య ఈ శోభయాత్ర సాగనుంది. ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేయాలని మొదట్లో ఉత్సవ సమితి సభ్యులు భావించినప్పటికీ భక్తులు మాత్రం ఊరేగింపుగా తీసుకెళ్లి హుస్సేన్‌సాగర్ లో నిమజ్జనం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో పోలీసుల అనుమతి కూడా లభించడంతో ఊరేగింపుగా వెళ్లనన్నాడు ఖైరతాబాద్ గణపతి.
ఇది ఇలావుండగా, నగరంలో మంగళవారం పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని సీపీ కోరారు. సోమవారం ట్యాంక్ బండ్ వద్ద మంగళవారం జరగనున్న నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా 30వేల విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని తెలిపారు. మంగళవారం జరగనున్న నిమజ్జన కార్యక్రమానికి 15వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారని, ప్రధాన కూడళ్ల వద్ద డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుందని వివరించారు.
పాతబస్తీ నుంచి నిమజ్జనానికి వచ్చే వాహనాలు కొన్ని నాళాల మరహ్మతుల కారణంగా దారి మళ్లిస్తున్నామని తెలిపారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న 50 వేల సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను సీపీ అంజనీకుమార్ విడుదల చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని మరో ప్రకటనలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ సూచించారు. ఉదయం 8గంటల నుంచి గణేష్ నిమజ్జనం ప్రారంభమవుతుందని తెలిపారు. సరూర్ నగర్ సరస్సులో నిమజ్జనం జరుగుతోందని చెప్పారు.












Click it and Unblock the Notifications