జీతం కోసం వెళితే..: పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హోంగార్డు రవీందర్ మృతి
హైదరాబాద్: నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గోషామహల్‌లో నాలుగు రోజుల క్రితం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ట్రాఫిక్ హోంగార్డు ఎం రవీందర్(38) మృతి చెందాడు. అపోలో డీఆర్డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
సకాలంలో జీతం అందకపోవడం, ఉన్నతాధికారుల వేధింపులకు మనస్తాపం చెందిన రవీందర్.. ఆదివారం హైదరాబాద్ ట్రాఫిక్ కమాండెంట్ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 60 శాతానికి పైగా తీవ్రంగా గాయపడిన అతడ్ని మొదట ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో కాంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్డీవో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఊపిరితిత్తులు దెబ్బతినడంతో వెంటిలేటర్ ద్వారా వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. పరిస్థితి మరింత విషమించడంతో శుక్రవారం ఉదయం రవీందర్ మృతి చెందాడు. దీంతో ఆయన భార్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తన భర్తను పోలీసులే హత్య చేశారని రవీందర్ భార్య ఆరోపించారు. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి తన భర్తను తనకు చూపించలేదని ఆయన భార్య తెలిపారు. తన భర్త మరణానికి కారణమైన పోలీసులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 17ఏళ్లుగా తన భర్త నీతి నిజాయితీలతో విధులు నిర్వహించారని తెలిపారు. సీఎం కేసీఆర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. రవీందర్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు.
జీతం సరైన సమయంలో రాకపోవడం, ఉన్నతాధికారుల వేధింపుల కారణంగానే రవీందర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన కుటుంబసభ్యులు, తోటి హోంగార్డులు ఆరోపిస్తున్నారు. రవీందర్ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున హోంగార్డులు ఆందోళన చేపట్టారు. రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని హోంగార్డులు కోరుతున్నారు.
రవీందర్ మృతిపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వ తీరు వల్లే రవీందర్ ప్రాణాలు కోల్పోయాడని అన్నారు. రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, హోంగార్డులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడాలని అన్నారు. తమ హక్కుల కోసం పోరాడాలని.. ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దన్నారు.
రవీందరర్ మృతిపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. రవీందర్ ఆత్మహత్య అత్యంత విషాదకరమని అన్నారు. రవీందర్ మరణానికి కారణమైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. హోంగార్డులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications