ఎయిర్‌పోర్ట్ మెట్రో కసరత్తులు: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రోను పరిశీలించిన ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
న్యూఢిల్లీ: శంషాబాద్ ఎయిర్ పోర్టును అనుసంధానం చేస్తూ నిర్మించతలపెట్టిన హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్ నిర్మాణం కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆయన బృందంతో కలిసి ఢిల్లీ విమానాశ్రయం మెట్రో సౌకర్యాలను, కార్యకలాపాలను అక్కడికి వెళ్లి అధ్యయనం చేశారు. ఢిల్లీ విమానాశ్రయం మెట్రో మొత్తం 23 కిలోమీటర్ల లైన్‌లో.. 16 కి.మీ భూగర్భ, 7 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌తో ఢిల్లీ విమానాశ్రయాన్ని కలుపుతూ ఎనిమిది మెట్రో రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
ఈ కారిడార్‌లో ఎయిర్ పోర్ట్ మెట్రో రైలు 19 నిమిషాల్లో గరిష్టంగా గంటకు 95 కిలోమీటర్ల వేగంతో.. సగటున 65 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. సీనియర్ డీఎంఆర్సీ అధికారులు.. హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆయన బృందాన్ని టీ-3 ఎయిర్ పోర్ట్ టెర్నిల్‌లో ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో ఉన్న భూగర్భ మెట్రో స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఉన్న లగేజీ చెకింగ్ విధానాన్ని హైదరాబాద్ మెట్రో బృందం పరిశీలించింది.

రెండు సిటీ మెట్రో స్టేషన్లలో చెన్-ఇన్ చేయబడి, ఢిల్లీ విమానాశ్రయానికి బదిలీ చేయబడిన లగేజీ విమానాశ్రయం వైపు బదిలీకి సంబంధించిన సౌకర్యాలను, ఇతర కార్యకలాపాలను ఎండీ , బృందం తనిఖీ చేశారు. ఢిల్లీ స్టేషన్లో చెక్ ఇన్, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ తో పాటు నిర్వహణ, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. డిపోలు, స్టేషన్ లేఅవుట్లు, మెట్రో కోచ్‌ల నిర్వహణ సౌకర్యాలు తదితర అంశాలపై అధ్యయనం చేశారు.
ఆ తర్వాత మెట్రో రైలులో న్యూఢిల్లీ స్టేషన్‌కు ప్రయాణించారు. అనంతరం ఎన్వీఎస్ రెడ్డి, ఆయన బృందం డీఎంఆర్సీ ఎండీ వికాస్ కుమార్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ఎండీ వీకే సింగ్, సీనియర్ ఇంజినీర్ల బృందంతో పరస్పర అనుభవాలను పంచుకున్నారు. ఎయిర్ మెట్రో స్టేషన్ల నిర్మాణానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.












Click it and Unblock the Notifications