హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు అక్కడికక్కడే మృతి...
హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న మైలార్‌దేవ్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగంతో వచ్చిన లారీ నియంత్రణ కోల్పోయి వారి పైకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆదివారం(జులై 4) తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదే రాజేంద్రనగర్‌లో శనివారం(జులై 3) జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడు ఇంటి బయట నిలబడి ఉన్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అతన్ని ఢీకొట్టింది. దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. స్థానికులు అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. సీసీటీవీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో తరుచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు నెలల క్రితం అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుల్తాన్‌బజార్ సీఐ లక్ష్మణ్,ఆయన భార్య ఝాన్సీ అక్కడికక్కడే మృతి చెందారు. సీఐ దంపతులు సూర్యాపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా... ఈ ప్రమాదం జరిగింది.ఆగి వున్న లారీని కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
రెండు నెలల క్రితం శామీర్‌పేట సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. గజ్వేల్‌లో ఓ శుభకార్యానికి హాజరై హైదరాబాద్‌కు తిరిగొస్తున్న క్రమంలో ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు కంటైనర్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కరుణాకర్‌రెడ్డి (46), భార్య సరళ (38), ఆమె చెల్లెలు సంధ్య(30) అక్కడికక్కడే మృతి చెందారు.












Click it and Unblock the Notifications