మానవత్వమే మా మతం: సిటీలో జైనుల కోవిడ్ కేర్ సెంటర్, నామమాత్రపు రుసుముతో చికిత్స..
కరోనా వైరస్ వచ్చినవారి పరిస్థితి అనిర్వచీయం. ఇక వైరస్ లక్షణాలు కనిపిస్తే చాలు బెంబేలెత్తిపోవాల్సిందే. అయితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన బెడ్లు లేవు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే ఫీజు మోత వాత తప్పదు. ఇందుకు జైన్ కమ్యూనిటీ ముందుకొచ్చింది. వంద పడకల కోవిడ్ కేర్ ఏర్పాటు చేసింది. కానీ నామమాత్రపు ఫీజు తీసుకొని.. సేవ అందిస్తోంది.
హైదరాబాద్ బేగంపేట వద్ద గల చీరాన్ పోర్ట్ క్లబ్ వద్ద జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసింది. 100 మందికి వసతి కల్పిస్తామని ఈ నెల 5 వ తేదీన కోవిడ్ సెంటర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. సెంటర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో మరో 70 పడకలు పెంచారు. 15 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వారిని సెంటర్‌లో చేర్చుకుంటున్నారు.

170 బెడ్ల సామర్థ్యం గల సెంటర్‌లో కరోనా లక్షణాలు ఉన్నవారిని కూడా చేర్చుకుంటున్నారు. వైరస్ ఉన్న వారిని ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉంచుతారు. కరోనా వైరస్ ప్రబలుతోన్న సమయంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో నగదు వసూల్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు లేకపోవడంతో సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని జిటో కోర్ కమిటీ ప్రతినిధి వినోద్ తెలిపారు.
కోవిడ్ సెంటర్‌లో చేరిన వారికి మందులు, ఆహారం, చికిత్స, కిట్లను తామే అందజేస్తామని తెలిపారు. ఇందుకు రోజుకు రూ.4 వేలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఏడు రోజులకు రూ.28 వేల నుంచి రూ.35 వేల వరకు తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్రంలో విజిటేబుల్ ఫుడ్ అందిస్తున్నాయని.. వారు కోరితే జైన్ ఆహారం కూడా అందిస్తామని తెలిపారు. మహావీర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ సహకారంతో కలిసి కేంద్రం నిర్వహిస్తున్నామని చెప్పారు. తమ వద్ద ఉన్నవారిని వైద్యులు 24 గంటలు పర్యవేక్షిస్తారని తెలిపారు. అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు. దేశంలో ఇఫ్పటికే జైన్ కోవిడ్ కేర్ సెంటర్లు 15 ఉండగా.. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన దానితో కలిపి ఆ సంఖ్య 16కి చేరింది.