హైదరాబాద్‌లో కాల్పుల కలకలం: గన్‌ఫౌండ్రీ ఎస్బీఐలో సెక్యూరిటీ గార్డ్ ఫైరింగ్, ఉద్యోగికి తీవ్రగాయాలు
హైదరాబాద్: నగరంలో బుధవారం కాల్పులు కలకలం రేపాయి. అబిడ్స్ గన్‌ఫౌండ్రీలోని ఎస్బీఐ కార్యాలయ ఆవరణలో బుధవారం మధ్యాహ్నం కాల్పులు చోటు చేసుకున్నాయి. బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సర్దార్ ఖాన్ జరిపిన కాల్పుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగి సురేందర్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది.. గాయపడిన సురేందర్‌ను ఆస్పత్రికి తరలించారు.
బ్యాంక్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కాల్పులు జరిపిన సర్దార్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సర్దార్ ఖాన్ 9 సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.

సర్దార్ ఖాన్, సురేందర్‌లు స్నేహితులేనని, అయితే, సురేందర్ ఎప్పుడూ సర్దార్‌ను ఏదో ఒక విషయంలో టీజ్ చేస్తుండేవాడని.. ఈరోజు కూడా అలానే చేశాడని చెప్పారు. అయితే, ఈరోజు సహనం కోల్పోయిన సర్దార్ ఖాన్.. సురేందర్‌పై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడని ఏసీపీ తెలిపారు. గుండెకు కింది భాగంలో సురేందర్‌కు గాయాలయ్యాయని తెలిపారు.

ప్రస్తుతం హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి సురేందర్ చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, సర్దార్ ఖాన్ విచారించిన అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పారు. బ్యాంక్ లావాదేవీలతో రద్దీగా ఉండే కార్యాలయంలో ఒక్కసారిగా కాల్పులు జరగడంతో బ్యాంక్ సిబ్బంది, కస్టమర్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.












Click it and Unblock the Notifications