తెలంగాణ విమోచన దినోత్సవాల్లో అమిత్ షా కీలక ప్రకటన: ఏడాది పొడవునా..!!
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవం గడువు సమీపిస్తోంది. ఇంకో మూడు రోజులే మిగిలివుంది. ఈ నెల 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏడాది పొడవునా ఈ వేడుకలను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. దీనికి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గౌరవ వందనం స్వీకరించనున్నారు.

ముఖ్యమంత్రులు..
జీ కిషన్ రెడ్డి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యలో ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే, బసవరాజ్ బొమ్మై ఇందులో పాల్గొననున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన పలు ప్రాంతాలు అప్పట్లో నిజాం పాలనలో కొనసాగడటమే దీనికి కారణం. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహించిన విషయం తెలిసిందే.

ఏడాది పొడవునా..
అదే తరహాలో తెలంగాణ విమోచనోత్సవాలను కూడా ఏడాది పాటు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇప్పటికే అమృతోత్సవాలుగా జరుపుకొంటామని ప్రకటించింది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏడాది పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనుంది. ఇందులో మూడు రాష్ట్రాలు విలీనమై ఉండటం కలిసొచ్చే అంశంగా పరిగణిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే సభ సందర్భంగా దీనిపై అమిత్ షా- ఓ కీలక ప్రకటన చేస్తారని సమాచారం.

2023 సెప్టెంబర్ 17 వరకు
ఈ పరిస్థితుల మధ్య యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ సహా కర్ణాటక, మరాఠ్వాడా ప్రాంతాల్లో గల అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో హైదరాబాద్ విమోచన దినోత్సవాలను నిర్వహించాలంటూ యూజీసీ కార్యదర్శి రజనీష్ జైన్ ఆదేశించారు. ఈ సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 2023 సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఈ వేడుకలను కొనసాగించాలని అన్నారు.

డిబేట్స్..
ఈ ఏడాది కాలం పాటు యూనివర్శిటీలు, కాలేజీల్లో హైదరాబాద్ స్టేట్ విమోచనానికి సంబంధించి- ప్రముఖులతో డిబేట్లు, ఉపన్యాసాలు, చర్చలను ఏర్పాటు చేయాలని రజినీష్ జైన్ ఆదేశించారు. విమోచనోద్యమంలో ప్రాణాలొడ్డి పోరాడిన వీరుల గాథలతో కూడిన నాటకాలను ప్రదర్శించాలని, ఫొటో ఎగ్జిబిషన్లను నిర్వహించాలని అన్నారు.

డాక్యుమెంటరీలు..
తెరపైకి రాని అన్ సంగ్ హీరోల గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను ఈ ఏడాది కాలం పాటు చేపట్టాలని రజినీష్ జైన్ సూచించారు. క్విజ్-వక్తృత్వ పోటీలు, ఫిల్మ్/డాక్యుమెంటరీ మేకింగ్, పెయింటింగ్, ఫొటోగ్రఫీ.. వంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని, హైదరాబాద్ స్టేట్ విమోచనంపై విద్యార్థుల్లో సమగ్ర అవగాహన కల్పించాలని ఆయన తెలంగాణ-మరాఠ్వాడా-కర్ణాటకల్లో అన్ని యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లు, కాలేజీల ప్రిన్సిపల్స్‌లకు ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications