దొంగతనం జరగడంతో డిప్రెషన్ లోకి వెళ్లిన యువతి
ఉన్నత విద్యను అభ్యసించడానికి దేశం కాని దేశం వెళ్లిన ఆమె వస్తువులన్నీ దొంగతనానికి గురికావడంతో మనస్తాపానికి గురయ్యారు. అపురూపంగా దాచుకున్న కొన్ని ముఖ్యమైన వస్తువులు కావడంతో ఆ దొంగతనాన్ని తట్టుకోలేకపోయారు. ఎదుటి మనుషులను కూడా సరిగా గుర్తించలేని పరిస్థితుల్లో ఆ విద్యార్థినిని చికాగో వీధుల్లో హైదరాబాద్ కు చెందినవారు గుర్తించారు. వివరాలు తెలుసుకొని ఆమె తల్లిదండ్రులద్వారా మాట్లాడించారు. అన్ని విధాలుగా ఆమెకు సాయం చేస్తామని చికాగోలోని ఇండియా కాన్సులేట్ ట్వీట్ చేసింది.
సయ్యదాలు మిన్హాజ్ జైదీ అమెరికాలోని డెట్రాయిట్ లో ఉన్న TRINE విశ్వవిద్యాలయం నుండి ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి 2021లో వెళ్లింది. అయితే ఆమె వస్తువులన్నీ చోరీకి గురై తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లింది. తక్షణమే తమ కుమార్తెను ఇండియాకు తీసుకురావాలని జైదీ తల్లి ఫాతిమా విదేశాంగశాఖ మంత్రి ఎస్ జై శంకర్ కు లేఖ రాశారు. జైదీ దుర్భర స్థితిలో ఉన్న విషయాన్ని మజ్లిస్ బచావో తెహ్రీక్ (MBT) అధికార ప్రతినిధి అమ్జెద్ ఉల్లా ఖాన్ తెరపైకి తెచ్చారు.

రెండు నెలల క్రితం వరకు కూడా తమ కుమార్తె తమతో టచ్ లో ఉందని, రెండు నెలల నుంచి మాత్రం టచ్ లో లేదని జైదీ తల్లి వెల్లడించారు. ఉన్నత విద్యకోసం వెళ్లిన యువతి ఇటువంటి పరిస్థితిలో కనపడటంపై దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి చికాగోలోని భారత కాన్సులేట్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ కు ఎంబీటీ ప్రతినిధి కూడా విజ్ఞప్తి చేశారు.
ఆమె వెంటనే ప్రయాణం చేసే పరిస్థితిలో లేదని, మెరుగైన వైద్యచికిత్సనందించిన తర్వాత ఇండియాకు పంపిస్తామని కాన్సులేట్ సిబ్బంది తెలిపారు. ఆమెను కలుసుకోవడం కోసం జైదీ తల్లిదండ్రులను చికాగో పంపించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వారిద్దరికీ పాస్ పోర్టులు లేకపోవడంతో హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ నుంచి పాస్ పోర్టు, వీసాలు పొందడంలో సహాయం చేయాలని ఐటీ మంత్రి కేటీఆర్ ను కోరుతూ ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జెద్ ఉల్లాఖాన్ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications