Himanshu Rao : పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్ కొడుకు...
ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు,మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నటికీ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు.'నేనొక విషయం స్పష్టం చేయదలుచుకున్నా.నేను ఎన్నటికీ రాజకీయాల్లోకి రాను. ఎందుకంటే నాకంటూ కొన్ని కలలు,సాధించాల్సిన లక్ష్యాలు ఉన్నాయి.' అని వెల్లడించారు.
మరో ట్వీట్‌లో... తన పుట్టినరోజైన జులై 12న అందరి నుంచి ఒక గిఫ్ట్ ఆశిస్తున్నానని హిమాన్షు పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడేలా,భవిష్యత్ తరాల కోసం ప్రతీ ఒక్కరూ ఒక మొక్కను నాటాలని కోరారు. పుట్టినరోజు నాడు తనకు బొకేలు,పూలు పంపించే బదులు ఈ పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది తన 16వ పుట్టినరోజు అని... ప్రస్తుతం తన ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య కూడా 16వేలు అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నవారికి ధన్యవాదాలు తెలిపారు.

గత నెలలో హిమాన్షుకు ప్రతిష్ఠాత్మక డయానా అవార్డు లభించిన సంగతి తెలిసిందే. గ్రామాలను స్వయం సమృద్ది దిశగా నడపడంతో పాటు కల్తీ రహిత ఆహారాన్ని ఉత్పత్తి చేసేలా గ్రామీణ ప్రజలను చైతన్యవంతం చేయాలన్న ఉద్దేశంతో షోమా పేరుతో హిమాన్షు ఓ ప్రాజెక్టును చేపట్టారు. గజ్వేల్ నియోజకవర్గంలోని గంగాపూర్,యూసుఫ్‌ఖాన్ పల్లిలను ఇందుకోసం ఎంచుకుని ప్రాజెక్ట్ వర్క్ చేశారు. హిమాన్షు కృషికి మెచ్చి డయానా అవార్డు ఆర్గనైజేషన్ అతడికి అవార్డును ప్రకటించింది. అవార్డు వరించిన సందర్భంగా తనకు సహకరించిన గ్రామస్తులకు, తన మెంటార్లకు హిమాన్షు కృతజ్ఞతలు తెలిపారు.
హిమాన్షుపై గతంలో రేవంత్ సహా పలువురు రాజకీయ నాయకులు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో హిమాన్షు కూడా రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హిమాన్షు తన తాజా ప్రకటనతో ఆ ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం హిమాన్షు చిన్న వయసులో ఉన్నారు కాబట్టి రాజకీయాలపై అంతగా ఆసక్తి లేకపోవచ్చు గానీ.. ఆ తర్వాత మనసు మారవచ్చునని అభిప్రాయపడుతున్నవారు లేకపోలేదు.












Click it and Unblock the Notifications