దేశంలో కాంగ్రెస్ గాలి వీస్తోంది...కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగిపోయారు: మధుయాష్కీ
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందని అన్నారు కాంగ్రెస్ నేత మధు యాష్కీ గౌడ్. తెలంగాణలో ప్రజాకూటమి ప్రభుత్వంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. నాలుగునర్రేళ్ల కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు నరకం చూపించిందని చెప్పిన మధు యాష్కీ గౌడ్... వారికి డిసెంబర్ 11తో విముక్తి కలుగుతుందన్నారు. సర్వేలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి ప్రభుత్వంలోకి వస్తుందన్నారు. ఓటింగ్‌లో భారీగా పాల్గొన్న ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ తరుపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అధికార పార్టీ టీఆర్ఎస్ ఎన్నో ప్రలోభాలకు గురిచేసినప్పటికీ ప్రజలు తమ విజ్ఞతతో ఓటువేశారని చెప్పారు. కూటమి నేతలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు మధుయాష్కీ. తనను మెట్‌పల్లిలో హత్య చేసేందుకు కుట్రపన్నారని చెప్పిన ఆయన తన హత్య కోసం మూడురోజుల ముందే స్కెచ్ వేశారని ఆరోపించారు. కొమిరెడ్డి కార్యకర్తలమని చెప్పి తనపై దాడి చేశారని మధుయాష్కీ తెలిపారు. పోలింగ్‌కు ముందు కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. నాలుగున్నర ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజలను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని మండిపడ్డారు. నిన్నటి పోలింగ్ సరళిని బట్టి కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని స్పష్టమైనట్లు చెప్పారు.
సోనియా గాంధీ సభ తర్వాత ఓటర్ల మైండ్ సెట్ మారిందన్న మధుయాష్కీ... గతంలో తమకు ప్రాతినిథ్యం లేని చోట్లు కూడా ఈ సారి కాంగ్రెస్ గెలవబోతోందనే ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ దాడులకు పాల్పడిందని మధుయాష్కీ చెప్పారు. తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత నిజామాబాద్ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి ఇతర నాయకులతో మాట్లాడినట్లు తనదగ్గర స్పష్టమైన సమాచారం ఉందని అన్నారు మధుయాష్కీ గౌడ్.












Click it and Unblock the Notifications