ఆర్‌ఎస్ బ్రదర్స్ సంస్థలపై ఐటీ దాడులు: సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లోనూ
హైదరాబాద్: నగరంలోని పలు చోట్ల ఆదాయపుపన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. ప్రముఖ వ్యాపార సంస్థలు ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థలపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. సంస్థ యజమానుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో ఏకకాలంలో 25కుపైగా ఐటీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. కూకట్ పల్లిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే సోదాలు జరుపుతున్నారు. సిబ్బందిని కూడా ఐటీ అధికారులు లోపలికి అనుమతించలేదు. ఆదాయపుపన్నులో తేడాలు ఉండటంతోనే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

కాగా, గత కొద్ది రోజులుగా సీబీఐ, ఈడీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఐటీ శాఖ దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నాయి.
ఢిల్లీ మద్యం స్కాం కేసులో అభిషేక్ బోయినపల్లికి కస్టడీ పొడిగింపు
ఢిల్లీ మద్యం స్కాంలో అభిషేక్ బోయినపల్లికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కస్టడీని పొడిగించింది. మరో రెండు రోజులపాటు విచారించేందుకు సీబీఐ అనుమతి కోరగా.. కోర్టు అనుమతినిచ్చింది. ఇదే వ్యవహారంలో అరుణ్ రామచంద్ర పిళ్లైకి నోటీసులు ఇచ్చినట్లు సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది.