kcr cabinet expansion pocharam srinivas reddy assembly speaker padma devender reddy కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ అసెంబ్లీ స్పీకర్
ఫిబ్రవరి మొదటి వారంలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ..మంత్రి పదవులు వీరికి దక్కే ఛాన్స్
తెలంగాణలో ఎన్నికలు ముగిసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయి దాదాపు నెల రోజులకు పైనే అయ్యింది. అయితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి, హోంమంత్రి తప్ప ఇతరత్రా మంత్రులు లేరు. ఇదిగో ఇప్పుడు అదిగో అప్పుడు అంటూ మంత్రివర్గ విస్తరణపై వార్తలు షికారు చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వచ్చిన వార్తల ప్రకారం మంత్రివర్గ విస్తరణ శుక్రవారం జరగాల్సి ఉన్నింది. అయితే అది జరగలేదు. మళ్లీ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడుంటుందా అంటూ ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ వర్గాల్లో మంత్రి వర్గ విస్తరణ తేదీ మళ్లీ చర్చకు వచ్చింది. ఇంతకీ మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడుంటుంది అవకాశం ఎవరికి దక్కుతుందనే దానిపై గులాబీ క్యాడర్‌లో జోరుగా డిస్కషన్స్ జరుగుతున్నాయి.

మంత్రులుగా ఎవరిని తీసుకోవాలో క్లారిటీతో ఉన్న కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులకు పైనే అవుతున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేయలేకపోయారు సీఎం కేసీఆర్. మంత్రి పదవి కోసం ఎవరికి వారు పైరవీలు ప్రారంభించినట్లు సమాచారం. ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన గులాబీ బాస్‌కు తన కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలో ఇప్పటికే స్పష్టతతో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడుంటుందా అనే దానిపై ఇటు టీఆర్ఎస్ వర్గాల్లో అటు ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే మంత్రి వర్గ విస్తరణపై మరో తేదీ చక్కర్లు కొడుతోంది.

స్పీకర్ పై వీడిన సస్పెన్స్.. మంత్రిపదవిపైనే ఎమ్మెల్యేల చూపు
ఇప్పటికే స్పీకర్ ఎన్నిక జరిగిపోయినందున తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ లోపే మంత్రి వర్గ విస్తరణ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నాట్లు సమాచారం. అంటే మంత్రి వర్గ విస్తరణ ఫిబ్రవరి 3 లేదా 6వ తేదీన ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ స్పీకర్ తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో స్పీకర్‌గా ఎవరు ఉంటారా అనేదానిపై సస్పెన్స్ నెలకొంది. స్పీకర్ తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయం అని నేతలు నమ్ముతున్న క్రమంలో ఆ పదవిని చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే స్పీకర్ పదవిని తాను చేపట్టేందుకు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకోవడంతో ఇక స్పీకర్ పదవిపై సస్పెన్స్ వీడింది. అంతకుముందు స్పీకర్ పదవిని ఈటల రాజేందర్, పద్మాదేవేందర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, రెడ్యానాయక్‌లు వరిస్తారనే వార్త చక్కర్లు కొట్టింది. అయితే స్పీకర్ పదవిని తీసుకునేందుకు ఈ నేతలంతా ససేమిరా అనడం, ఆ తర్వాత పోచారం ఒప్పుకోవడం అన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలంతా తమ మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఎవరి ప్రయత్నాలు వారు చాలా గట్టిగానే చేస్తున్నట్లు సమాచారం.

పాత జిల్లాల వారికే మంత్రి పదవి ఇచ్చే యోచనలో కేసీఆర్..?
స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్ రెడ్డి వెళ్లిపోవడంతో బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి మంత్రిపదవి కోసం లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఈటల రాజేందర్‌కు మంత్రి పదవి దక్కనుండగా.. పాత జిల్లాల నుంచే మంత్రి పదవులు ఇవ్వాలనే ఆలోచనతో కేసీఆర్ కూడా ఉన్నట్లు సమాచారం. అంటే మరో 8 మందిని మంత్రులుగా కేసీఆర్ తన కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఇక మెదక్ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు కాబట్టి పద్మాదేవేందర్ రెడ్డికి ఛాన్సెస్ కాస్త తక్కకువనే చెప్పాలి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీఎం పాత జిల్లాలకు చెందిన వ్యక్తులకే మంత్రి పదవులు ఇవ్వాలని భావిస్తే... పద్మా దేవేందర్ రెడ్డి రెండో విడత మంత్రి వర్గ విస్తరణ వరకు ఆగక తప్పదు. ఎందుకంటే తొలి విడతలో పాత వారితో పాటు కొత్త వారికి కూడా మంత్రిగా అవకాశం ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.
ఇక జిల్లాలవారీగా చూస్తే కరీంనగర్ నుంచి కొప్పుల ఈశ్వర్, నిజామాబాద్ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, వరంగల్ నుంచి రెడ్యానాయక్‌లు కేసీఆర్ కేబినెట్‌లో తొలిసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశముంది. ఇక డిప్యూటీ స్పీకర్‌గా రేఖానాయక్, వినయ్ భాస్కర్‌లా పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమచారం. ఇక దళిత సామాజిక వర్గానికి చెందిన బాల్క సుమన్‌కు ఛీఫ్ విప్ లేదా విప్ పోస్టును కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.