తెలంగాణలో అర్ధరాత్రి వరకూ లిక్కర్ షాప్స్.. స్పెషల్ డ్రంకన్ డ్రైవ్... ఈ ఆంక్షలు, నిబంధనలు పాటించాల్సిందే...
నూతన సంవత్సరం నేపథ్యంలో నేటి(డిసెంబర్ 31) రాత్రి హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్,సైబరాబాద్,రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గురువారం రాత్రి 10గం. నుంచి శుక్రవారం(జనవరి 1,2021) ఉదయం 5గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్ల వేళలను ప్రభుత్వం ఒంటిగంట వరకూ పొడిగించిన నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నగరంలో ఈవెంట్లు,సామూహిక వేడుకలపై నిషేధం విధించినప్పటికీ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు ఇవ్వొద్దన్న ఉద్దేశంతో ట్రాఫిక్ ఆంక్షలు అమలుచేస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలతో పాటు పలు కీలక సూచనలు కూడా చేశారు.

అర్ధరాత్రి వరకూ మద్యం షాపులు
కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్ల వేళలను ప్రభుత్వం పొడిగించింది. మద్యం దుకాణాలు గురు,శుక్రవారాల్లో రాత్రి 12 గంటలదాకా తెరిచి ఉంచేందుకు అనుమతించింది. బార్లు, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా అనుమతి ఉన్న దుకాణాలకు ఈ అనుమతులిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. కొవిడ్ నిబంధనలకు లోబడి ఈ అనుమతులు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల పర్మిట్ రూమ్‌లను తెరిచేందుకు కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో బార్లు,పబ్బులు,రిసార్టులు,బహిరంగ ప్రదేశాలు,హోటళ్లలో వేడుకలపై ప్రభుత్వం నిషేధం విధించింది

స్పెషల్ డ్రంకన్ డ్రైవ్...
గురు,శుక్రవారాల్లో పోలీసుల ప్రత్యేక డ్రంకన్ డ్రైవ్ ఉంటుంది. దాదాపు 3వేల మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొంటారు.రాత్రి పూట ఆటో,క్యాబ్,ట్యాక్సీ డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలి. మద్యం సేవించేవారిని ఇళ్లకు పంపించాల్సిన బాధ్యత బార్లు,పబ్బులు,క్లబ్బుల నిర్వాహకులదే. అకారణంగా ట్రిప్పులు రద్దు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ఒకవేళ అలాంటి సమస్యలు తలెత్తితే రాచకొండ పోలీస్ వాట్సాప్ 9490617111కి ఫిర్యాదు చేయాలి. బహిరంగ ప్రదేశాలు,హోటళ్లు,రిసార్టులు,పబ్బుల్లో వేడుకలపై నిషేధం విధించిన నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఆ ఫ్లైఓవర్ మినహా..
నగరంలోని బేగంపేట ఫ్లైఓవర్ మినహా మిగతా ఫ్లైఓవర్లపై నేటి రాత్రి 10గం. నుంచి ఉదయం 5గం. వరకు రాకపోకలను నిషేధించారు. నెక్లెస్ రోడ్,ఎన్టీఆర్ మార్గ్,ట్యాంక్‌బండ్‌లపై వేడుకలను నిషేధించారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ఖైరతాబాద్ సర్కిల్ నుంచి నెక్లెస్ రోడ్ వెళ్లే వాహనాలు ఎన్టీఆర్ మార్గ్ నుంచి కాకుండా లక్టీ కపూల్ మీదుగా వెళ్లాలి. బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వెళ్లేవారు తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఇక్బాల్ మినార్ మీదుగా చేరుకోవాలి.

ట్యాంక్‌బండ్,కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలు నిషేధం..
లిబర్టీ టు ట్యాంక్ బండ్,సికింద్రాబాద్ టు ట్యాంక్ బండ్,మింట్ కాంపౌండ్ టు నెక్లెస్ రోడ్,ట్యాంక్ బండ్‌లకు రాకపోకలకు అనుమతి లేదు. ఓఆర్ఆర్‌పై గురువారం రాత్రి 11గం. నుంచి శుక్రవారం తెల్లవారుజామున 5గం. వరకు వాహనాలను అనుమతించరు. శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించేవారికి మాత్రమే ఓఆర్ఆర్‌పై అనుమతి ఉంటుంది. వాళ్లు కూడా విమాన టికెట్ చూపిస్తేనే పోలీసులు అందుకు అనుమతిస్తారు.సైబర్ టవర్స్,గచ్చిబౌలి,బయో డైవర్సిటీ,మైండ్ స్పేస్,జేఎన్టీయూ ఫోరం మాల్,కామినేని,ఎల్బీనగర్,సాగర్ రింగ్ రోడ్డు ఫ్లైఓవర్,చింతలకుంట అండర్‌పాస్‌లను మూసివేయనున్నారు. అలాగే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలను నిషేధించారు.