తెలంగాణాలో లాక్ డౌన్ యధాతధం... సీఎం కేసీఆర్ నిర్ణయం పైనే సర్వత్రా ఉత్కంఠ
తెలంగాణా రాష్ట్రంలో లాక్‌డౌన్ యథాతథంగా కొనసాగుతుందని తెలంగాణా సర్కార్ స్పష్టం చేస్తుంది. ఒక పక్క కేంద్రం జోన్ల వారీగా లాక్ డౌన్ సడలింపులు ప్రకటించినా సరే సడలింపులపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకుంటామని తెలంగాణా ప్రభుత్వం పేర్కొంది. ఇక ఈ విషయంపావు మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కేంద్రం ఇచ్చిన లాక్ డౌన్ సడలింపుల మార్గాదర్శకాలపై క్యాబినెట్ భేటీ తర్వాతే నిర్ణయం తీసుకుంటారని , తెలంగాణాలో అప్పటి వరకు సడలింపులు ఉండబోవని పేర్కొన్నారు .
Recommended Video

కేంద్రం ఇచ్చిన సడలింపులపై తెలంగాణా ప్రభుత్వ కసరత్తు
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే మద్యం షాపులతో పాటు పలు షాపులు తెరిచేందుకు, ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ పనులు చేసుకునేందుకు పలు అంశాల్లో కొత్తగా సడలింపులనిచ్చింది. దేశవ్యాప్తంగా మే 4 నుంచి ఈ సడలింపులు అమల్లోకి వస్తాయని కేంద్రం పేర్కొన్నప్పటికీ తెలంగాణా రాష్ట్రంలో మాత్రం ఆ తేదీ నుంచి అమల్లోకి రావని తెలంగాణా సర్కార్ స్పష్టం చేస్తుంది.

5 న క్యాబినెట్ భేటీ ..స్థానిక పరిస్థితులపై లోతుగా పరిశీలించాకే నిర్ణయం
ఇక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల అమలుకు ఉన్న అవకాశాలను పరిశీలించి వాటి వల్ల కరోనా వ్యాప్తి జరగదు అని భావిస్తేనే రాష్ట్రంలో ఆయా సడలింపులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇక కేంద్రప్రభుత్వ నూతన సడలింపు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 5న ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు , తాజాగా కేంద్రం సడలింపులు అంశాలపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది.

తెలంగాణా క్యాబినెట్ ఆమోదిస్తేనే అమల్లోకి సడలింపులు
తెలంగాణా కేబినెట్ ఆమోదించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలే రాష్ట్రంలో అమల్లోకి రానున్నాయి. ఆమోదించనివి అమలయ్యే పరిస్థితి లేదు .అంటురోగాల నియంత్రణ చట్టం, విపత్తుల నిర్వహణ చట్టాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మేరకు విచక్షణాధికారాన్ని కలిగి ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకొనే నిర్ణయాలు మే 6 నుంచి లేదా 8 నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చే అవకాశముంది.ఈ నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయం పై ఉత్కంఠ నెలకొంది.

కేంద్ర నిర్ణయాలు ఓకే కానీ .. మా విచక్షణాధికారం మేరేకే నిర్ణయాలు అంటున్న టీ సర్కార్
తెలంగాణా సీఎం కేసీఆర్ లాక్ డౌన్ లో సడలింపులను అంగీకరిస్తారా లేదా అన్న ప్రశ్న మొదలయింది. గతంలో కూడా కేంద్రం చేసిన సడలింపులను కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేయలేదు. అంతే కాకుండా కేంద్రం మే 3వరకు లాక్ డౌన్ విధించినప్పటికీ కేసీఆర్ మే 7 వరకు లాక్ డౌన్ ను పొడిగించారు. ఇక ఈ నేపధ్యంలో కేసీఆర్ లాక్ డౌన్ ను మరింత పొడిగిస్తారా ? లేదా లాక్ డౌన్ లో సడలింపులు అమలు చేస్తారా ? అన్నదానిపై కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది .












Click it and Unblock the Notifications