చలి చంపేస్తోంది..? రాత్రే కాదు పగలు కూడా, కోహిర్‌లో 3.4, కొత్తగూడెం వీధిలో 3.2 డిగ్రీలు
చలి పంజా విసిరింది. దీంతో జనం చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో .. చలి తీవ్రత పెరిగింది. రాత్రి వేళ, తెల్లవారు జామున చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. బుధవారం నుంచి మూడురోజులపాటు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. బుధవారం ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

కోహిర్‌లో 3.4 డిగ్రీలు
సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో చలి ఎక్కువగా ఉంది. అత్యల్పంగా 3.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ భీంపూర్ మండలం అర్లి (టీ)లో 3.6, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో 3.9 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం డోంగ్లిలో 4.7, ఆదిలాబాద్ జిల్లా బేలలో 5, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి, వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం నాగారంలో 5.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నిర్మల్ జిల్లా కుభీర్, పెంబిలో 5.7, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో 6 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటవీ సరిహద్దు గ్రామాల్లో చలి ఎక్కువగా ఉంటుంది.

ఒకరి మృతి
చలి తీవ్రతకు మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఒకరు మృతిచెందారు. మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామానికి చెందిన రేఖ వెంకటయ్య కొంతకాలంగా మరిపెడ మున్సిపల్ కాంప్లెక్స్‌లో భిక్షాటన చేస్తున్నాడు. మంగళవారం చలి తీవ్రతను తట్టుకోలేక మృత్యువాత పడ్డాడు.

హైదరాబాద్‌లో కూడా..
హైదరాబాద్‌లో 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. సాధారణం కన్నా 7 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రాజేంద్రనగర్‌లో అత్యల్పంగా 7.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత.. హయత్‌నగర్‌లో అత్యధికంగా 12.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఏపీలో చలి పంజా..
ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. కొత్తగూడెం వీధిలో 3.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మన్యంలో దట్టంగా పొగమంచు అలుముకుంది. అరకు, లంబసింగి, పాడేరు, మినములూరులో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అరకు వ్యాలీలో 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పాడేరులో 9, మినములూరులో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.