సినీ గేయ రచయిత కందికొండ మృతి.. క్యాన్సర్‌తో పోరాడి..ఓడి
ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి కన్నుమూశారు. ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆరోగ్యం విషమించడంతో చనిపోయారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. మంచి గేయ రచయిత అని గుర్తుచేసుకున్నారు. స్వల్ప కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు.
గత కొంతకాలంగా కందికొండ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో చికిత్సకు తన ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో కేటీఆర్ మెరుగైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేశారు. మోతీనగర్‌లో కందికొండ కుటుంబం ఉంటున్న ఇంటి అద్దె చెల్లించలేకపోవడంతో ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే విషయాన్ని కందికొండ కూతురు మాతృక మంత్రి కేటీఆర్‌కు ఇదివరకే తెలియజేశారు. లేఖ రాయగా మంత్రి కేటీఆర్ స్పందించారు. గతంలో అండగా ఉన్నట్లే ఇప్పుడూ ఉంటామని ఆయన ట్విట్టర్‌లో వేదికగా తెలిపారు.

తెలుగు సినిమాలతోపాటు తెలంగాణకు సంబంధించి ఎన్నో మరుపురాని పాటు రాసిన గేయ రచయిత కందికొండ యాదగిరి.. తెలుగు సినీ గేయ రచయితగా కందికొండకు మంచి పేరుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' చిత్రంలో 'మళ్లి కూయవే గువ్వ' పాటతో ఆయన గేయ రచయితగా మారారు. ఆ తర్వాత 'ఇడియట్'లో 'చూపుల్తో గుచ్చి గుచ్చి', 'సత్యం'లో 'మధురమే మధురమే', 'ఐయామ్ ఇన్ లవ్', 'పోకిరి'లో 'గల గల పారుతున్న గోదారిలా' 'జగడమే', 'లవ్‌లీ'లో 'లవ్‌లీ లవ్‌లీ' తదితర పాటలు రాశారు. చివరిగా 2018లో 'నీది నాది ఒకే కథ'లో రెండు పాటలు రాశారు. తెలంగాణ పండుగలైన బోనాలు, బతుకమ్మతోపాటు రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే పలు పాటలను కందికొండ రాశారు.












Click it and Unblock the Notifications